
జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ ఉద్యమంలో ఆర్డీఎస్ ను ఆయుధంగా చేసుకొని సీఎం పదవి చేపట్టిన కేసీఆర్.. నేడు ఆర్డీఎస్ ను పట్టించుకోవడం లేదన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఎన్నికల ముందు ఓట్లకోసం తుమ్మిళ్ల ప్రాజెక్టును తెరమీదకు తెచ్చిన కేసీఆర్.. పనులను పూర్తి చేయలేదన్నారు. ఆర్డీఎస్ వద్ద అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్డీఎస్ నీటిని తరలించడానికి కుట్ర జరుగుతున్నా.. ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. రోజూ ఇరిగేషన్ ల పై సమీక్షలు నిర్వహించే కేసీఆర్.. పక్క రాష్ట్రం వాళ్ళు అనుమతులు లేకుండా 400 టన్నుల స్టీల్ దింపి, 4 టీఎంసీల నీటిని కొల్లగొట్టడానికే ప్లాన్ చేస్తున్నారన్నారు. అయినా దానిపై కేసీఆర్ మాట్లాడకపోవడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. 15.9 టీఎంసీల తెలంగాణ నీటి వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని..మూడు రాష్ట్రల సీఈలు ఆర్డీఎస్ బండ్ పై పర్యవేక్షణ చేసి అక్కడి పరిస్థితులపై వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఎందుకు దృష్టి సారించడంలేదని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు డీకే అరుణ.