
- హరీశ్‌కు ఫైనాన్స్..
- కేటీఆర్‌కు ఐటీ, ఇండస్ట్రీ, మున్సిపల్ శాఖలు
- సబితా ఇంద్రారెడ్డికి విద్యా శాఖ
- గంగులకు బీసీ వెల్ఫేర్, సివిల్ సప్లైస్
- సత్యవతికి ఎస్టీ వెల్ఫేర్, మహిళా శిశు సంక్షేమం
- పువ్వాడ అజయ్‌కి ట్రాన్స్‌పోర్టు
- విద్యా శాఖ నుంచి విద్యుత్‌కు జగదీశ్ షిఫ్ట్
- కొప్పుల, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి,మల్లారెడ్డి శాఖల్లో కోత
- సీఎం కేసీఆర్ వద్దే ఇరిగేషన్, రెవెన్యూ, మైనింగ్
- ఒకే కారులో వచ్చి.. పక్కపక్కనే కూర్చున్న బావాబామ్మర్దులు హరీశ్, కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ ఫుల్ కేబినెట్ కొలువుదీరింది. ఆదివారం ఆరుగురు కొత్త మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌కు తాజా విస్తరణలో మినిస్టర్లుగా అవకాశం దక్కింది. సాయంత్రం 4 గంటల 14 నిమిషాలకు రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణం స్వీకారం మొదలై.. పది నిమిషాల్లో ముగిసింది. ఉదయమే రాష్ట్ర కొత్త గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్.. సాయంత్రమే కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు.
రాష్ట్ర కేబినెట్లో సీఎంతో కలిపి మొత్తం 18 మందికి చాన్స్ ఉండగా.. ఇప్పటిదాకా 12 మందే ఉన్నారు. ఇప్పుడు మరో ఆరుగురిని తీసుకోవడంతో ఫుల్ కేబినెట్ ఏర్పడినట్లయింది. కొత్త మినిస్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత వారికి శాఖలను కూడా కేటాయించారు. ఆర్థిక మంత్రిగా తన్నీరు హరీశ్‌రావును నియమించారు. కేటీఆర్‌కు గత ప్రభుత్వంలో దక్కిన ఐటీ, మున్సిపల్, ఇండస్ట్రీ శాఖలే ఈసారి కూడా దక్కాయి. విద్యా శాఖ మంత్రిగా కొనసాగుతున్న జగదీశ్‌రెడ్డిని విద్యుత్ శాఖకు షిఫ్ట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డికి కీలకమైన విద్యా శాఖను కేటాయించారు.
బావాబామ్మర్ది.. ఒకే కారు, ఒకే సీటు
ప్రమాణ స్వీకారానికి బావాబామ్మర్దులు హరీశ్‌రావు, కేటీఆర్ ఇద్దరూ ఒకే కారులో రాజ్ భవన్ కు వచ్చారు. వారు లోపలికి రాగానే నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారిద్దరూ ఒక్కో నేత దగ్గరకు వెళ్లి పలుకరించారు. ప్రమాణం చేసే ముందు వరకూ హరీశ్, కేటీఆర్ పక్కపక్కనే ఒకే సోఫాలో కూర్చొని ముచ్చటించుకున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత కేటీఆర్, హరీశ్ వేర్వేరు కార్లలో ప్రగతి భవన్ కు వెళ్లారు. కేటీఆర్ ప్రమాణం చేసే సమయంలో కరీంనగర్, ఖమ్మం నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు ‘కేటీఆర్ జిందాబాద్’ అంటూ భారీగా నినాదాలు చేశారు. ఆ సమయంలో గవర్నర్ కాస్త ఇబ్బంది పడినట్టు కనిపించింది. మంత్రులుగా తొలుత హరీశ్‌రావు.. ఆయన తర్వాత కేటీఆర్ ప్రమాణం చేశారు. అటు తర్వాత వరుసగా సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌తో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు.
కొప్పుల, వేముల, నిరంజన్, మల్లారెడ్డి శాఖల్లో కోత
మంత్రి కొప్పుల ఈశ్వర్ దగ్గర అన్ని సంక్షేమ శాఖలు ఉండగా.. వాటిలో నుంచి గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖలను తీసేసి కొత్తవారికి కేటాయించారు. ఇంత కాలం వ్యవసాయ శాఖతో పాటు సివిల్సప్లై శాఖలను చూస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి నుంచి సివిల్ సప్లై శాఖను తొలగించారు. ఇన్నాళ్లూ ఆర్ అండ్ బీ, ట్రాన్స్‌పోర్టు శాఖలను చూస్తున్న వేముల ప్రశాంత్ రెడ్డి నుంచి ట్రాన్స్‌పోర్టు శాఖను తీసేశారు. మంత్రి చామకూర మల్లారెడ్డి శాఖలను కూడా కుదించారు. ఇన్నాళ్లూ ఆయన వద్ద కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీలతోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖలు ఉండేవి. మంత్రివర్గ విస్తరణ తరువాత ఆయన నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖను తీసేసి సత్యవతి రాథోడ్ కు కేటాయించారు.
జగదీశ్‌కు అప్పుడలా.. ఇప్పుడిలా..
మంత్రి జగదీశ్‌రెడ్డికి విద్యాశాఖ అచ్చిరాలేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. గత ప్రభుత్వంలో తొలుత ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో డిప్యూటీ సీఎంగా, హెల్త్ మినిస్టర్‌గా ఉన్న రాజయ్యను బర్తరఫ్ చేసి.. ఆయన స్థానంలో కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంగా తీసుకున్నారు. ఆ సమయంలో జగదీశ్‌రెడ్డి దగ్గరున్న విద్యా శాఖను కడియంకు కేటాయించారు. జగదీశ్‌కు విద్యుత్ శాఖ ఇచ్చారు. డిసెంబర్లో రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయనకు తిరిగి విద్యా శాఖను కేటాయించారు. తాజాగా మంత్రివర్గ విస్తరణలో జగదీశ్‌రెడ్డిని విద్యాశాఖ నుంచి విద్యుత్ శాఖకు మార్చారు.
ఆశలు ఆవిరైన వారు వేడుకకు దూరం!
రాజ్‌భవన్‌లో ఆదివారం సాయంత్రం 4.14 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రారంభమై పది నిమిషాల్లో పూర్తయింది. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకొని పదవి దక్కని ఎమ్మెల్యేలు వేడుకకు రాలేదు. కార్యక్రమానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా రాలేదు. ప్రమాణస్వీకారోత్సవం ముగిసిన తర్వాత గవర్నర్ తో సీఎం కేసీఆర్, 17 మంది మంత్రులు గ్రూప్ ఫొటో దిగారు. ప్రమాణం చేసిన తర్వాత హరీశ్‌రావు సీఎం కేసీఆర్ కాళ్లకు మొక్కే ప్రయత్నం చేయగా ఆయన వారించారు. కేటీఆర్, సత్యవతి రాథోడ్ కేసీఆర్ కు పాదాభివందనం చేశారు. గంగుల, పువ్వాడ అజయ్ కూడా కాళ్లకు నమస్కారం చేయబోతుంటే సీఎం వద్దని అన్నారు. ప్రమాణ పత్రాలు చదివిన తన వద్దకు ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చిన ఆరుగురు కొత్త మంత్రులకు గవర్నర్ ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ చెప్పారు. కార్యక్రమానికి కేటీఆర్ చేనేత దుస్తులను ధరించి వచ్చారు. గంగుల ఒక్కరే ప్రమాణం సమయంలో కొంత టెన్షన్ పడగా మిగతావారు కూల్ గా ప్రమాణ పత్రాలను చదివారు.
తొలిసారి మహిళలకు
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి మహిళలకు కేబినెట్లో చోటు దక్కింది. 2014లో ఫస్ట్ టైమ్ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నాలుగున్నరేండ్ల పాలనలో మహిళలను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. గత డిసెంబర్లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు మొదట సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణం చేశారు. అటు తర్వాత ఫిబ్రవరిలో మరో పది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అందులో కూడా మహిళలకు చాన్స్ ఇవ్వలేదు. ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో మాత్రం ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు దక్కాయి.
పెద్ద శాఖలన్నీ కేసీఆర్ వద్దే
ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక మంత్రులకు శాఖలు కేటాయిస్తూ రాజ్ భవన్ నోట్ విడుదల చేసింది. కీలకమైన ఇరిగేషన్, రెవెన్యూ, మైనింగ్ శాఖలను ముఖ్యమంత్రి కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ బాధ్యతలు చూసిన హరీశ్‌రావుకు ఈసారి ఫైనాన్స్ శాఖను ఇచ్చారు. కేటీఆర్ కు గత ప్రభుత్వంలో చూసిన శాఖలను మళ్లీ కేటాయించారు. ఇక తొలిసారి మంత్రిగా ప్రమాణం చేసిన గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌కు ప్రాధాన్యం ఉన్న శాఖలు ఇచ్చారు. గంగులకు బీసీ వెల్ఫేర్, సివిల్ సప్లైస్.. పువ్వాడకు ట్రాన్స్పోర్ట్ శాఖలు కేటాయించారు.