అధికారం కోసం కేసీఆర్‌‌ ఫ్యామిలీ కుట్రలు: తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్‌‌

అధికారం కోసం కేసీఆర్‌‌ ఫ్యామిలీ కుట్రలు: తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్‌‌

వరంగల్‍, వెలుగు : అధికారం కోసం కేసీఆర్‍ ఫ్యామిలీ మరోసారి కుట్రలు చేస్తోందని తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్‌‌, రిటైర్డ్‌‌ ప్రొఫెసర్‌‌ కూరపాటి వెంకట నారాయణ ఆరోపించారు. అవినీతి ఆఫీసర్లు, కార్పొరేట్‌‌ సంస్థలు, దోపిడీ రాజకీయ నాయకులతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చి, అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తోందని, దీనిని ప్రజలే అడ్డుకోవాలని సూచించారు. గ్రేటర్‌‌ వరంగల్‌‌లోని ప్రెస్‌‌క్లబ్‌‌లో శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌‌ వారసత్వ, ఆధిపత్య, అవినీతి రాజకీయాల కారణంగా తెలంగాణ ప్రాంతం దోపిడీకి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. 

విద్య, వైద్య, ఉపాధి రంగాలను నాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం లేని ప్రాజెక్ట్‌‌లను నిర్మించడం వల్ల రాష్ట్రంపై మోయలేని భారం పడిందని, కేసీఆర్‌‌ కుటుంబఆస్తులు మాత్రం తెలంగాణ దాటి.. దుబాయ్‍, లండన్‌‌ వరకు విస్తరించాయన్నారు. ధరణి పోర్టల్‌‌ ద్వారా వేలాది ఎకరాలను తన వారికి అప్పగించే కుట్ర చేశారని ఆరోపించారు. రైతులకు బేడీలు, ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించిన దళితులను పోలీసులతో చిత్రహింసలకు గురి చేశారని గుర్తు చేశారు. 

గల్లీగల్లీకి లిక్కర్‌‌ను సప్లై చేసి ప్రజలను బానిసలుగా మార్చారని మండిపడ్డారు. కేసీఆర్‌‌ హయాంలో ఉద్యమకారులు, పేద స్టూడెంట్లు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. వరంగల్‌‌లోని చారిత్రక సెంట్రల్‌‌ జైలును కూల్చి.. ఆ భూములను తాకట్టు పెట్టి వందల కోట్లు అప్పు చేశారన్నారు. ఎల్కతుర్తిలో సభ ఎందుకు నిర్వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. పుల్లూరు సుధాకర్‌‌ మాట్లాడుతూ కేసీఆర్‌‌ సర్కార్‌‌ చేసిన ఆర్థిక, సామాజిక విధ్వంసం ఎఫెక్ట్‌‌ మరో 50 ఏండ్ల వరకు ఉంటుందన్నారు. కేవలం హైదరాబాద్‌‌ ఆదాయాన్ని చూపి.. రాష్ట్రం మొత్తం జీడీపీ పెరిగిందని ప్రజలను మోసం చేశారన్నారు.