కమీషన్లతో రాష్ట్రాన్ని కేసీఆర్ ఫ్యామిలీ దోచుకున్నది: మంత్రి వివేక్

కమీషన్లతో రాష్ట్రాన్ని కేసీఆర్ ఫ్యామిలీ దోచుకున్నది: మంత్రి వివేక్
  • తప్పుడు డిజైన్​తో కాళేశ్వరం పనికిరాకుండా పోయింది
  •     బ్యాక్ వాటర్​తో రైతులు నష్టపోతున్నరు
  •     లక్ష కోట్లు ఖర్చు చేస్తే ఏడాది కూడా నీళ్లివ్వలేదు
  •     యూరియా కోసం గల్లీలో కాదు.. ఢిల్లీలో ధర్నా చేయాలి
  •     బ్యాక్​వాటర్​తో నీట మునిగిన పంట పొలాల పరిశీలన
  •     డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ


కోల్​బెల్ట్/కోటపల్లి, వెలుగు: కేసీఆర్ ఫ్యామిలీ కమీషన్లతో రాష్ట్రాన్ని దోచుకున్నదని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. తప్పుడు డిజైన్ కారణంగానే కాళేశ్వరం పనికిరాకుండా పోయిందని విమర్శించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ కారణంగా వందలాది ఎకరాల్లో పంట నీటమునుగుతున్నదని మండిపడ్డారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ పెడితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడలేదని, ఇప్పుడేమో ధర్నాలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

బీఆర్ఎస్ లీడర్లంతా ప్రాజెక్ట్, రోడ్లపై కాకుండా కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంగళవారం మంత్రి వివేక్ పర్యటించారు. బ్యాక్​వాటర్​తో చెన్నూరు మండలం సుందరశాల, కోటపల్లి మండలం అన్నారంలో నీట మునిగిన పంట పొలాలను వర్షంలోనే ఆయన పరిశీలించారు. సుమారు 200 ఎకరాల్లో పంట నష్టపోయామని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. 

‘‘మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి.. అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి కృషి చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద భారీగా నీటి లభ్యత ఉంది. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించే చాన్స్ ఉండేది. ఈ ప్రాజెక్ట్ కు రూ.11వేల కోట్లు ఖర్చయ్యాయి. మరో రూ.24వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్ట్ పూర్తయ్యేది. కమీషన్ల కోసం తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్ట్​ను కాళేశ్వరానికి కేసీఆర్ తరలించారు. తప్పుడు డిజైన్ల కారణంగానే ఐదేండ్లుగా చెన్నూరు సెగ్మెంట్ రైతులు బ్యాక్ వాటర్​తో నష్టపోతున్నారు. బీఆర్ఎస్ లీడర్లు ఏనాడూ బాధిత రైతులను పట్టించుకోలేదు’’అని వివేక్ మండిపడ్డారు.

కేసీఆర్​కు పాలాభిషేకాలు చేయడం విడ్డూరం

కేసీఆర్ హయాంలో ఇంజనీర్లు లంచాలు తీసుకొని ధనవంతులుగా మారారని మంత్రి వివేక్ ఆరోపించారు. ఇటీవల ఐటీ దాడులతో వారి బాగోతాలు బయటపడ్డాయని చెప్పారు. ‘‘సోమవారం సీఎంతో జరిగిన మీటింగ్​లో కరకట్టలు నిర్మించి బ్యాక్ వాటర్ సమస్యను పరిష్కరించాలని కోరిన. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీర్, 80వేల పుస్తకాలు చదివి కాళేశ్వరం కట్టిండని కేసీఆర్​కు బీఆర్ఎస్ లీడర్లు పాలాభిషేకాలు చేయడం విడ్డూరంగా ఉంది. లక్ష కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే.. ఏడాది కూడా నీళ్లివ్వలేదు. అయినప్పటికీ రైతులు 70శాతం పంటలు పండించారు’’అని వివేక్ అన్నారు.

పదేండ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే

దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్నబియ్యం పథకాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి వివేక్ అన్నారు. ‘‘పేద ప్రజలు కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో రూ.12వేల కోట్లు ఖర్చు చేసి బియ్యం పంపిణీ చేస్తున్నది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు, ఒక్క డబుల్​బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసింది. ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నది’’అని వివేక్ అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని సింగరేణి ఆర్కే సీఈవో క్లబ్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వివేక్​ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ కలిసి 230 మంది డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చెంద్రయ్య, డీఆర్​డీవో కిషన్, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, మందమర్రి తహసీల్దార్ సతీశ్, సీఐ శశిధర్ రెడ్డి, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, లీడర్లు పాల్గొన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్  లీడర్లు తోడు దొంగలు 

బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు తోడు దొంగలు అని మంత్రి వివేక్ విమర్శించారు. ‘‘రైతులకు సరిపడా యూరియా అందించడం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆ పార్టీ లీడర్లు ధర్నాలు చేయడం సిగ్గుచేటు. యూరియా కోసం ధర్నాలు గల్లీల్లో కాదు.. ఢిల్లీలో చేయాలి. కేంద్రం సరిగ్గా యూరియా సప్లై చేయడం లేదు. నేను పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు రూ.10వేల కోట్ల రుణమాఫీ చేయించి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రీ ఓపెన్​కు కృషి చేసిన. కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీని సరిగ్గా నడపడం లేదు. యూరియా విషయంలో ఫర్టిలైజర్ డీలర్లు అవినీతికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇటీవల మహారాష్ట్రకు అక్రమంగా లారీలో తరలిస్తున్న యూరియాను పట్టుకున్నం’’అని వివేక్ తెలిపారు.