కేసీఆర్ ఫ్యామిలీ తిహార్ జైలుకే.. గెలిచాక లిక్కర్​స్కాంపై విచారణ జరిపిస్తాం

కేసీఆర్ ఫ్యామిలీ తిహార్ జైలుకే.. గెలిచాక లిక్కర్​స్కాంపై విచారణ జరిపిస్తాం
  • కేసీఆర్​కు రిటైర్మెంట్​ ఇవ్వండి
  • సీడబ్ల్యూసీ మెంబర్​, నేషనల్ ​స్పోక్స్​పర్సన్​ అల్కా లాంబ

నల్గొండ అర్బన్, వెలుగు: తెలంగాణ నుంచి ఢిల్లీని పాలిస్తామంటున్న కేసీఆర్, ఆయన ఫ్యామిలీ తిహార్ జైలుకు వెళ్లడం ఖాయమని కాంగ్రెస్​సీడబ్ల్యూసీ మెంబర్, ఆ పార్టీ నేషనల్​ స్పోక్స్​పర్సన్​ అల్కాలాంబ హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను తప్పించడానికి బీజేపీ..బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తోందని, కాంగ్రెస్​అధికారంలోకి వచ్చాక లిక్కర్ ​కేసులో విచారణ జరిపి..కవితపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. ఆదివారం నల్గొండలో ఎంపీ కోమటిరెడ్డి క్యాంపు ఆఫీసులో ఎంపీ, నల్గొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ స్పోక్స్ పర్సన్ గౌతమ్ సేథ్ తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సోనియా గాంధీ మిగులు బడ్జెట్ తో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పు చేశారని, దీనివల్ల రాష్ర్టంలోని ఒక్కో వ్యక్తిపై రూ.1.50 లక్షల భారం పడిందన్నారు.

టీఆర్ఎస్ లో 'టీ' ని తీసివేసి భారత్ అని పెట్టుకున్న కేసీఆర్ కు మొత్తానికి తెలంగాణ రాష్ట్రం నుంచి రిటైర్మెంట్ ఇవ్వాలన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరిగిందని, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, కర్ణాటకలో అదే జరిగిందని, ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చిందన్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ 12కు 12 స్థానాలు గెలుస్తుందన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 9 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదని, ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్​గౌడ్​, నల్గొండ ఎంపీపీ మనిమద్దె సుమన్ పాల్గొన్నారు.