అధికారం పోతదని కేసీఆర్​కు భయం

అధికారం పోతదని కేసీఆర్​కు భయం

రాష్ట్రాన్ని రుణ సంస్థలకు తాకట్టు పెట్టారు
నిలిచిపోయిన పాలన, ఆగిన సంక్షేమ పథకాలు
మున్సిపోల్స్​లో గెలిచేందుకు ఈసీతో కలసి టీఆర్​ఎస్​ కుట్ర
రిజర్వేషన్లు అనుకూలంగా మార్చుకునేందుకు ఒత్తిళ్లు
ఎస్సీ ఓటర్లను బీసీలుగా, ఓసీలుగా మార్చిన అధికారులు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఆరోపణ

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదని తెలిసే కొడుకు కేటీఆర్​ను సీఎం సీటులో కూర్చోబెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ ఆరోపించారు. ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించిన కేసీఆర్, వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి ఇప్పుడే అధికారాన్ని కొడుక్కు అప్పగించాలని చూస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని స్పష్టం చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని, ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టి రుణ వ్యవధిని ఏకంగా 40 ఏండ్లకు పెంచారని లక్ష్మణ్​ మండిపడ్డారు. రాష్ట్రాన్ని రుణ సంస్థలకు తాకట్టు పెట్టిన కేసీఆర్, పాలనను గాలికొదిలేశారని, దీంతో సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోయాయని, వివిధ రకాల ఫించన్లు కూడా అందడం లేదని చెప్పారు. ఈ ఆరేండ్లలో కేసీఆర్ ఫాంహౌస్​ కు నీళ్లు, నిధులు వచ్చాయని, ఆయన ఫ్యామిలీకి పదవులు వచ్చాయని, కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు మాత్రం రాలేదని, లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇప్పటి వరకు 28 వేల ఉద్యోగాలే ఇచ్చారని, గత రెండేండ్లలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు.

ఎలాగైనా గెలిచేందుకు కుట్రలు

మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘంతో కలిసి టీఆర్ఎస్ కుట్రలు చేసిందని లక్ష్మణ్​ ఆరోపించారు. రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు.. అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారని, కొన్ని వార్డుల్లో ఎస్సీ ఓటర్లను, బీసీలుగా, ఓసీలుగా మార్చడంతో ఎస్సీలకు రిజర్వ్ కావాల్సిన వార్డులు ఓసీల పరం అవుతున్నాయని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు, జిల్లా, మండల పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో చేసిన కుట్రలనే, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. తుది ఓటర్ల జాబితా రెడీ కాకుండా, రిజర్వేషన్లు ఖరారు చేయకుండా షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారని
ప్రశ్నించారు.

రాజకీయ లబ్ధి కోసమే సోమేశ్​ నియామకం

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియామకం డీవోపీటీ రూల్స్​కు విరుద్ధమని, రాజకీయ లబ్ధి కోసమే సీఎం కేసీఆర్.. సోమేశ్​ను సీఎస్ గా నియమించారని లక్ష్మణ్​ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కోలేకనే టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి సిటిజన్​షిప్​ బిల్లును తెరపైకి తీసుకువచ్చి విషం చిమ్ముతున్నాయని లక్ష్మణ్ ​ఫైర్​ అయ్యారు. మజ్లిస్ తో అంటకాగుతున్న టీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితులు లేవన్నారు. కాగా, ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గానికి చెందిన భూక్యా భాస్కర్​ నాయక్, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గాలకు చెందిన 30 మంది కాంగ్రెస్ నేతలు శనివారం బీజేపీలో చేరారు. లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.