ఏదడిగితే అది… చింతమడకలో ఇంటింటికి ప్రయోజనాలు

ఏదడిగితే అది…  చింతమడకలో ఇంటింటికి ప్రయోజనాలు

తాను పుట్టిన చింతమడక గ్రామంలో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల మేర ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ చెప్పినట్లే చేసి చూపిస్తున్నారు. సీఎం స్వగ్రామంలో గడపగడపకూ ఉపాధి పథకాలు అందుతున్నాయి. కార్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, డీసీఎంలు ఇలా ఏ వాహనాలను కోరుకుంటే ఆ వాహనాలు గ్రామస్థుల ఇండ్ల ఎదుట ప్రత్యక్షమవుతున్నాయి. కోరుకున్నవాళ్లకు కోళ్ల ఫారాలు, డెయిరీ ఫారాలూ మంజూరవుతున్నాయి. సీఎం ఆదేశాల మేరకు చింతమడకతోపాటు దాని అనుబంధ గ్రామాలపై  దృష్టిపెట్టిన అధికారులు ఇప్పటికే  716 కుటుంబాలకు 607  యూనిట్లు అందజేశారు. ఇందుకోసం రూ.53.68 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.

ఆరు నెలల్లో ఆచరణలోకి..

సీఎం కేసీఆర్​ గత ఏడాది జులై 22న తన పుట్టిన ఊరు చింతమడకలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, వారిపై వరాల జల్లు కురిపించారు. ప్రతి కుటుంబానికి డబుల్​ బెడ్​రూమ్​ఇల్లు, ఉపాధి కోసం కనీసం రూ.10 లక్షల మేర ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాలతో మరుసటి రోజే ఆఫీసర్లు రంగంలోకి దిగారు. చింతమడక, అంకంపేట,  మాచాపూర్, సీతారాంపల్లి( పూర్వపు చింతమడక గ్రామం పరిధిలోనివి)లో ఇంటింటి సర్వే నిర్వహించారు. మొత్తం1506  కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయా కుటుంబాలు ఉపాధి కోసం ఏమేం కోరుకుంటున్నారో ఆరా తీశారు. అలా ప్రత్యేక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. ఇప్పటివరకు రాష్ట్ర సర్కారు నాలుగు  విడతల్లో రూ.53.68 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తంతో 716 కుటుంబాలకు 607 యూనిట్లను కొనుగోలు చేసి అందజేశారు. ఈ యూనిట్లలో కార్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, డీసీఎంలు, ఆటోలు, ప్రౌల్ట్రీ, డెయిరీ ఫారాలు ఉన్నాయి. యూనిట్​ ఖర్చు రూ.10లక్షలు, ఆలోపైతే ఒక కుటుంబానికి, యూనిట్​ఖర్చు రూ.10 లక్షలు దాటితే పార్ట్​నర్​షిప్​లో అందజేస్తున్నారు. మొత్తం మీద ప్రతి కుటుంబానికి పది లక్షల మేర ప్రయోజనం కల్పిస్తున్నారు. 1506  కుటుంబాలకు ఉపాధి కోసం రూ.200 కోట్లయినా వెచ్చించేందుకు తాను సిద్ధమని గతంలోనే సీఎం  కేసీఆర్  ప్రకటించారు. అందులో భాగంగా ప్రస్తుతం 716 కుటుంబాలకు రూ.53 కోట్లదాకా వెచ్చించారు. మరో  790 కుటుంబాల కోసం అవసరమైన నిధులు(సుమారు రూ.60 కోట్లు) త్వరలో విడుదల కానున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

చకచకా డబుల్ బెడ్​రూమ్​ ఇండ్ల పనులు

చింతమడక  సహా మూడు గ్రామాల్లో  డబుల్  బెడ్ రూమ్ ఇండ్లు, కల్యాణ మండపాల నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే ఉన్న పాత ఇండ్లను కూల్చివేసే కార్యక్రమం మొదలైంది. వాటి స్థానాల్లో ఎర్రవెల్లి మోడల్​లో డబుల్  బెడ్ రూమ్  ఇండ్లను నిర్మించనున్నారు. గ్రామస్థులకు ఆయా శివార్లలో తాత్కాలిక  నివాసాలను ఏర్పాటు చేశారు. అలాగే గ్రామంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్య సూచిక తయారు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారి రక్త నమూనాలు సేకరించారు. సీఎం పర్యటన తర్వాత గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించి, వ్యాధులతో బాధపడుతున్నవారిని హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు.

జేసీబీ తీసుకున్నం

సీఎం కేసీఆర్  సహకారంతో గ్రామస్థులందరికి ఊర్లోనే ఉపాధి దొరికింది.  ప్రభుత్వం ఇచ్చిన  ఆర్థిక సహాయంతో కొందరం కలసి జేసీబీ తీసుకున్నం. దాంతో వచ్చే ఆదాయంతో  ఊర్లో ఉంటూ కుటుంబాన్ని పోషించుకునే అవకాశం పలువురికి లభించింది. – ఎల్లప్పగారి పోచయ్య, చింతమడక

50 శాతం మందికి సాయం అందించాం

సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక
సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకు గ్రామంలో గుర్తించిన కుటుంబాల్లో యాభై శాతం మందికి నాలుగు విడతల్లో ఉపాధికి సాయం అందించాం. మిగిలిన వారికి త్వరలోనే అందిస్తాం. దాంతోపాటు డబుల్  బెడ్ రూమ్  ఇండ్లు నిర్మించి ఇవ్వనున్నాం. చింతమడకను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి  కృషి చేస్తున్నాం. – హరీశ్​రావు, ఆర్థిక శాఖ మంత్రి

 

ఇప్పటివరకు పంపిణీ చేసినవి
వాహనం పంపిణీ
కార్లు 43
డీసీఎంలు 2
గూడ్స్ కారియర్లు 26
హార్వెస్టర్లు 47
జేసీబీలు 26
ట్రాక్టర్లు 40
పౌల్ట్రీ ఫామ్స్ 5
ఆటో మొబైల్​షాప్ 1
కార్పెంటర్ మిషన్లు 1
కాం క్రీట్ మిక్చర్ వెహికల్స్ 7