
సంస్థ దగ్గర ₹ 10 కోట్లే ఉన్నాయన్న అడిషనల్ ఏజీ
ఆర్థిక ఇబ్బందులున్నప్పుడు సమ్మెకు వెళ్లారు: ఏజీ
ప్రభుత్వం నుంచి ₹ 4,900 కోట్ల బకాయిలు రావాలి: యూనియన్లు
మా విచారణకు ఆకాశమే హద్దు
చర్చలు ఎలా ఉండాలో ముందే నిర్ణయిస్తే ఎట్లా?
కోర్టు అంటే లెక్కలేదా?.. అంత ఆషామాషీనా?
రూ. 50 కోట్లు కూడా ప్రభుత్వం ఇవ్వలేదా?
బస్సుల్లేకపోతే జనం పరిస్థితి ఏంది?: హైకోర్టు
విచారణ నేటికి వాయిదా
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఆర్థిక సంక్షోభంలో ఉందని, దాన్ని ఎప్పుడూ ప్రభుత్వం ఆదుకుంటూనే ఉందని, ఇంకా ఎంతకాలం ఆదుకోవాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. సంస్థ దగ్గర ప్రస్తుతం రూ. 10 కోట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ సమ్మెను ఆపాలని కోరుతూ ఓయూ రీసెర్చ్ స్కాలర్ సుబేందర్‌సింగ్ దాఖలు చేసిన పిల్‌ను సోమవారం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జడ్జి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ జె.రామచందర్‌రావు వాదిస్తూ.. సమ్మె చట్ట విరుద్ధమని, ఈ మేరకు ఉత్తర్వులివ్వాలని కోరారు. గతంలో (2015) హైకోర్టు ఆ విధమైన ఆదేశాలిచ్చిందని తెలిపారు. ఆర్టీసీకి వార్షిక నష్టం రూ.1200 కోట్లని, సమ్మె వల్ల ఇప్పుడు రూ. 75 కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు. ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని, ఆదాయం రూ. 4882 కోట్లు అయితే ఖర్చు రూ. 5811 కోట్లని తెలిపారు. ప్రస్తుత అప్పు రూ.4709 కోట్లని, ఇందులో రూ.1660 కోట్లు క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ పీఎఫ్ అని, రూ.3049 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్, లీవుల నగదు తదితర అని వివరించారు. 2015లో 44 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం వల్ల ఏడాదికి రూ. 900 కోట్ల భారం పడిందని, 2017లో మధ్యంతర భృతి 16 శాతం ఇస్తే ఏడాదికి రూ.200 కోట్లు అవుతోందని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. 2014–15 నుంచి 2019 సెప్టెంబర్ వరకూ రూ. 4253 కోట్లు ప్రభుత్వం ఇచ్చిందని, ఇలా ఎంతకాలం ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రశ్నించారు. ఆర్టీసీ యూనియన్లతో చర్చలు జరపాలని ఈ నెల 18న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 26న అధికారులు 21 డిమాండ్లపై చర్చలు జరిపారని అదనపు ఏజీ తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ఆమోదయోగ్యం కాని డిమాండ్‌ను చర్చిస్తేనే ఇతర డిమాండ్లపై చర్చ చేస్తామని యూనియన్లు పట్టుబట్టాయని, ఆ రోజు వాయిదా వేశాక తిరిగి సమావేశమై అధికారులు నిరీక్షించినా యూనియన్లు స్పందించలేదని చెప్పారు. విలీనం అంశం ఏనాటికీ అమలు కాబోదని స్పష్టం చేశారు.
మా విచారణ పరిధి ఆకాశమే: హైకోర్టు
రాయితీల బకాయిల్లో రూ.47 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని డివిజన్ బెంచ్ ప్రశ్నించగా.. అదనపు ఏజీ కల్పించుకుని రాజ్యాంగంలోని 226 ఆర్టికల్ కింద అన్నింటినీ హైకోర్టు విచారణ చేయాల్సిన అవసరం లేదన్నారు. ‘‘10 వేల బస్సుల్లో నాలుగు వేలు మాత్రమే నడస్తున్నాయి. రోగుల ఇక్కట్లు వర్ణనాతీతం. పౌర, మానవహక్కుల అంశంతో ముడిపడిన వ్యవహారమిది. రాజ్యాంగంలోని 226 ప్రకారం విచారణ పరిధి ఆకాశమే. అదే తీరుగా హైకోర్టు విచారణ చేస్తుంది’’ అని బెంచ్ తేల్చిచెప్పింది.
కోర్టు అంటే లెక్కలేదా?
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల(ఈడీల) కమిటీ రూపొందించిన రిపోర్టులోని అంశాల్ని అడిషనల్ ఏజీ చెపుతుంటే డివిజన్ బెంచ్ కల్పించుకొని.. ఆ రిపోర్టు ప్రతిని అడిగి తీసుకుంది. ఈ రిపోర్టు చూస్తే ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది. ‘‘చర్చలు ఏవిధంగా ఉండాలో, ఏవిధమైన ఫలితాలు ఉండాలో ముందే ఒక నిర్ణయంతో రిపోర్టు రూపొందించినట్లుగా ఉంది. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదు” అని పేర్కొంది. క్లోజ్‌డ్ మైండ్‌గా రిపోర్టు ఉందని, ఇలాంటి అభిప్రాయం ఉన్నప్పుడు అసలు చర్చలు ఎందుకు జరిపారని ప్రశ్నించింది. ‘‘నాలుగు డిమాండ్లకు ఆర్థిక భారం ఉంటుందని ఈడీల కమిటీ తేల్చినప్పుడు మిగిలిన వాటి ఊసెందుకు ఎత్తలేదు? 21వ డిమాండ్ ఏపీ విభజన చట్టంతో ముడిపడిందన్నారేగానీ ఆ చట్టాన్ని వివరించలేదు. కోర్టు అంటే లెక్కేలేనట్లుగా ఉంది. అంతా ఆషామాషీగా తీసుకున్నట్లుగా ఉంది. బ్యూరోక్రాట్స్ తీరు మరీ అధ్వానంగా ఉంది. బస్సులకు స్పేర్ పార్ట్ కావాలనే డిమాండ్ అమలుకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేదు. యూనిఫారాలనూ ఖర్చుగా చూస్తారా? ఆర్టీసీ ఈడీల కమిటీ సమ్మె డిమాండ్లపై ఇచ్చిన నివేదికలో నాలుగు డిమాండ్లకు ఆర్థిక భారం రూ. 47 కోట్లు అవుతుందని ఉంది. మరి ఇతర డిమాండ్ల మాటేమిటో చెప్పలేదు” అని అని హైకోర్టు ప్రశ్నించింది. ఈడీల కమిటీ రిపోర్టులో నాలుగు డిమాండ్లను పరిష్కరించేందుకు రూ. 50 కోట్ల లోపు ఆర్థిక భారం పడుతుందని ఉందని, ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఇవ్వగలదో లేదో చెప్పాలని స్పష్టం చేసింది.
ఏజీని పిలిపించుకొని..
ఆర్టీసీ వద్ద నిధులు లేవని, ఉన్నవి రూ.10 కోట్లేనని అదనపు ఏజీ హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో తాము ప్రభుత్వంతోనే మాట్లాడతామని, ప్రభుత్వ రిప్రజెంటేటివ్‌గా అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ఇక్కడ ఉన్నారని, ఆయనను విచారణకు పిలిపించాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. వెంటనే వచ్చిన ఏజీ.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం చర్చలకు పిలిస్తే చాలా మొండిగా వ్యవహరించారని, ఆర్థికంగా కష్టంగా ఉన్న సమయంలో పండుగ వేళ సమ్మెలోకి వెళ్లి జనాన్ని ఇక్కట్లకు గురిచేశారని తెలిపారు. ‘‘ఇవన్నీ వాస్తవమే కావొచ్చు. కానీ.. సామాన్యుడి ప్రయాణ సాధనం ఆర్టీసీ బస్సేనని గుర్తించి సమ్మె పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి” అని హైకోర్టు కోరింది. అసలు ఈడీల కమిటీ రిపోర్టులోని లెక్కలన్నీ కరెక్టో కాదో తేల్చాలని, మిగిలిన డిమాండ్ల విషయంలో ఎంత భారం అవుతుందో కూడా తెలియజేయాలని ఆదేశిస్తూ..విచారణను మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.
జనం కష్టాలు చూడండి: హైకోర్టు
‘‘మేము కూడా ఆర్టీసీ బస్సులో తిరిగినవాళ్లమే. బస్సుల్లేకపోతే ఎలాంటి బాధలుంటాయో మాకూ తెలుసు. బస్సులు లేకపోతే.. మారుమూల గ్రామాల ప్రజల పరిస్థితి ఏమిటి?” అని ఆర్టీసీ మేనేజ్మెంట్ను, ప్రభుత్వాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. ఇప్పటికీ 40 శాతానికి మించి బస్సులు నడవడం లేదని, రోగులు అష్టకష్టాలుపడుతున్నారని తెలిపింది. ‘‘ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనుల గోడు చూడండి. అక్కడ రోగంతో బాధపడే ఓ పిల్లగాడ్ని వరంగల్ హాస్పిటల్‌కు తీసుకుపోవాలంటే మార్గం ఏది? పాలమూరు నుంచి ఓ డెంగీ రోగి హైదరాబాద్ ఎలా రాగలడు. సామాన్యుడు పడే బాధలను మానవీయకోణంలో చూడండి. వాళ్లకు ఆర్టీసీ బస్సే దిక్కు. వాళ్లేమీ సొంత డబ్బుతో అంబులెన్స్‌ల్లో వెళ్లలేరు. వాళ్లు మన ప్రభుత్వ పిల్లలే” అని పేర్కొంది.
నష్టాలకు యాజమాన్యం, ప్రభుత్వమే కారణం. ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో రూ. 4,900 కోట్ల బకాయిలు రావాలి. గతంలో 65,740 మంది ఉద్యోగులు ఉంటే.. ఆ సంఖ్య 49,733కి తగ్గింది. సర్కార్ నివేదికలు చూస్తే ఉద్యోగుల తప్పిదాలు లేవనేది స్పష్టమవుతోంది. కార్మికుల డిమాండ్లన్నింటిపైనా చర్చ జరపాలి. విలీనంపై ప్రభుత్వ వైఖరి ఏవిధంగా ఉన్నా దాని గురించి చర్చల్లో చెప్పి ఇతర వాటిపై చర్చించాలి.
– యూనియన్లు
ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఆదాయం రూ. 4,882 కోట్లు అయితే ఖర్చు రూ. 5,811 కోట్లు. 2014–15 నుంచి 2019 సెప్టెంబర్ వరకూ రూ. 4,253 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది. ఇలా ఎంతకాలం ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకుంటుంది? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ఆమోదయోగ్యం కాని డిమాండ్‌ను చర్చిస్తేనే ఇతర డిమాండ్లపై చర్చిస్తామని యూనియన్లు పట్టుబట్టాయి. విలీనం అంశం ఏనాటికీ అమలు కాబోదు.
– అడిషనల్ ఏజీ