రైతు బంధు మినహా అన్ని స్కీమ్‌లు బంద్

రైతు బంధు మినహా అన్ని స్కీమ్‌లు బంద్
  • దళిత బంధు అందింది 275 మందికే
  • సెకండ్​ ఫేజ్​ గొర్రెల పంపిణీ పత్తా లేదు
  • అప్లికేషన్ల దగ్గర్నే ఆగిన కొత్త ఆసరా పెన్షన్లు
  • డబుల్​ బెడ్రూం ఇండ్లు అంతంతే

గొర్రెల పంపిణీ 

సెకండ్​ ఫేజ్​ గొర్రెల పంపిణీకి ఇంతవరకూ అతీగతీ లేదు. ఫస్ట్​ ఫేజ్​లో 3 లక్షల 80  వేల యూనిట్లు పంపిణీ చేశారు. ఇంకా దాదాపు 3.50 లక్షల మంది గొల్ల, కురుమలు ఎదురు చూస్తున్నారు.

దళిత బంధు 

లబ్ధిదారులకు క్యాంపులు, ట్రైనింగ్​ల దగ్గర్నే  దళిత బంధు స్కీమ్​ ఆగిపోయింది. హుజూరాబాద్​ నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేసినప్పటికీ.. గ్రౌండింగ్‌ చేయక పోవడంతో వాడుకునే పరిస్థితి లేదు. 

మూడెకరాల భూ పంపిణీ

దళితులకు మూడెకరాల భూ పంపిణీ ముందటపడుతలేదు. మూడు లక్షల మందికి మూడెకరాల చొప్పున భూమిని ఇస్తామని చెప్పిన సర్కారు.. అందులో కనీసం 3 శాతం మందికి కూడా పంచలేదు. 

ఆసరా పెన్షన్లు 

మూడేండ్లుగా కొత్త ఆసరా పెన్షన్లు మంజూరు చేయలేదు. లక్షల్లో అప్లికేషన్లు పేరుకుపోయాయి. 57 ఏండ్లు నిండినోళ్ల నుంచి 2021  ఆగస్టు, అక్టోబర్ నెలల్లో రెండుసార్లు అప్లికేషన్లు తీసుకున్నారు. వాటి వెరిఫికేషనే మొదలు కాలే.

డబుల్​ బెడ్రూం 

ఏడేండ్లలో రాష్ట్రంలో డబుల్​ బెడ్రూం ఇండ్లు కేవలం 14 వేల మందికే అందాయి. మరికొన్ని ఇండ్లు నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. తమకు ఇల్లు లేదని, అర్హుల నుంచి అప్లికేషన్లు భారీగా వస్తున్నాయి. 

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ప్రకటించి  ప్రచారం చేసుకున్న స్కీమ్​లేవీ ముందుకు సాగుతలేవు.  రైతు బంధు మినహా అన్నిటిదీ ఇదే పరిస్థితి. క్యాష్​తో ముడిపడి ఉండటంతో ప్లాన్​ ప్రకారమే సర్కారు లేట్​ చేస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. అర్హులు ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. వారిని రేపు మాపు అంటూ అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. సర్కారు నుంచి టైంకు నిధులు రాకపోవడంతోనే స్కీమ్​లు నడిమిట్ల ఆగిపోతున్నాయని అంటున్నారు. దళిత కుటుంబానికి రూ.10 లక్షల పంపిణీ మొదలు.. డబుల్​ బెడ్రూం ఇండ్లు, గొర్ల పంపిణీ,  57 ఏండ్లు నిండినోళ్లకు ఆసరా పెన్షన్లు,  మూడెకరాల భూ పంపిణీ, రైతుల రుణమాఫీ.. ఇట్లా పథకాలన్నిటికీ దరఖాస్తుల గడువు పెంపు దగ్గర్నే బ్రేకులు పడ్డాయి. ఎక్కడన్న బై ఎలక్షన్​ ఉంటే అక్కడ మాత్రం హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. దళిత బంధు స్కీమ్​ ద్వారా ఇప్పటివరకు కేవలం 275 మందికే లబ్ధి చేకూరింది. డబుల్​ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రకటించి ఏడేండ్లయితున్నా.. 14 వేల మందికి మాత్రమే అమలు చేశారు. 2017లో తెచ్చిన గొర్రెల పంపిణీ స్కీమ్  ఇంకా 3.50 లక్షల మంది గొల్ల, కురుమలకు అందాల్సి ఉంది.  కొత్త ఆసరా పెన్షన్ల కోసం దాదాపు 14 లక్షల మంది ఎదురుచూడాల్సి వస్తున్నది. 

దళిత బంధు ఇచ్చింది..  275 మందికే

హుజూరాబాద్‌‌‌‌  బైపోల్​ టైంలో తెచ్చిన దళిత బంధు స్కీమ్.. లబ్ధిదారులకు క్యాంపులు, ట్రైనింగ్​ల దగ్గర్నే ఉన్నది. హుజూరాబాద్​ నియోజకవర్గం పరిధిలోని 18,064 మంది లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేసినప్పటికీ.. గ్రౌండింగ్‌‌‌‌ చేయకుండా కాలయాపన చేస్తున్నది. బైపోల్‌‌‌‌ తర్వాత ఇప్పటి దాకా రెండు నెలల్లో మొత్తం 150 మందికి మాత్రమే గ్రౌండింగ్‌‌‌‌ చేసింది. బైపోల్‌‌‌‌ కంటే ముందు 75 మందికి ఇచ్చింది. అంటే నియోజకవర్గంలో దళిత బంధు ప్రయోజనం చేకూరింది 225 మందికి మాత్రమే. సీఎం కేసీఆర్‌‌‌‌ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రిలోనూ ఇంకా పూ-ర్తి కాలేదు. ఇక్కడ 76 మంది ఎస్సీలకు దళిత బంధు ఇస్తామని చెప్పి.. ఇప్పటి దాకా 50 మందికి మాత్రమే గ్రౌండింగ్‌‌‌‌  చేసింది. రాష్ట్రంలోని నాలుగు ఎస్సీ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో ఎస్సీలందరికీ స్కీమ్ అమలు చేస్తామని ప్రకటించినా.. ముందుకు కదుల్తలేదు. ఇందుకు దాదాపు రూ. వెయ్యి కోట్లు అవసరం కాగా.. రూ. 205 కోట్లు మాత్రమే ప్రభుత్వం రిలీజ్‌‌‌‌ చేసింది. ఆ నాలుగు మండలాల్లో  లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఊసేలేదు. హుజూరాబాద్​ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో  వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి.. పథకం అమలు చేస్తామని ప్రభుత్వం రెండు నెలల కిందట్నే హామీ ఇచ్చింది. దీనిపై  ప్రత్యేక గైడ్​లైన్స్ రూపొందించాల్సి ఉండగా.. ఆ దిశగా సమావేశాలు గానీ, ప్రతిపాదనలు గానీ లేవు. ప్రభుత్వం దగ్గర పైసలు లేకనే దళిత బంధు పథకం అమలుపై ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తున్నది.

డబుల్ బెడ్రూం ఇండ్లు రాకపాయె

రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలందరికీ డబుల్‌‌‌‌ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని రాష్ట్ర సర్కారు హామీ ఇచ్చి ఏడేండ్లవుతున్నది. ఇప్పటిదాకా 14 వేల మందికి మాత్రమే పంపిణీ చేసింది. ఇంకా 1లక్షా 88వేల ఇండ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. మరికొన్ని ఇండ్లు నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన, నిర్మిస్తున్న ఇండ్ల సంఖ్య 2,91,057 గా ఉంది. తమకు ఇల్లు లేదని, డబుల్​ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని అర్హుల నుంచి అప్లికేషన్లు భారీగా వస్తున్నాయి. 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారమే రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలు 26.31 లక్షల మంది ఉన్నట్లు తేలింది. ఇప్పుడు ఈ సంఖ్య 30 లక్షలు దాటినట్లు అధికారులు చెప్తున్నారు. 2.91 లక్షల ఇండ్లు కట్టేందుకే ఏడేండ్లు దాటుతుంటే.. ఇంకా అర్హులైన పేదలకు ఎప్పుడు ఇండ్లు అందుతాయో తేలడం లేదు. టైంకు సర్కార్​ ఫండ్స్​ ఇవ్వకపోవడంతోనే ఇండ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదని తెలుస్తున్నది. ఎలక్షన్లు వచ్చినప్పుడే డబుల్  బెడ్రూం ఇండ్ల గురించి ప్రభుత్వం మాట్లాడుతుందని, తర్వాత పట్టించుకోవడం లేదని జనం మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే..  సొంత జాగా ఉన్న వాళ్లకు ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తమని 2021–22 బడ్జెట్​లో ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికీ దానికి సంబంధించి ఎలాంటి గైడ్​లైన్స్​ రూపొందించలేదు. నిధులూ విడుదల చేయలేదు. ఇంకో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ఇక ఈసారి అమలు లేనట్లేనని ఆఫీసర్లే చెప్తున్నారు.

కొత్త పెన్షన్లు ఏమాయె?

రాష్ట్రంలో గత మూడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆసరా పెన్షన్లు మంజూరు చేయడం లేదు. లక్షల్లో అప్లికేషన్లు పేరుకుపోయాయి. ఓల్డేజ్  పెన్షన్ కోసం 57 ఏండ్లు నిండినోళ్ల నుంచి 2021  ఆగస్టు, అక్టోబర్ నెలల్లో రెండుసార్లు అప్లికేషన్లు తీసుకున్నారు. ఆ అప్లికేషన్ల వెరిఫికేషన్ ను ప్రభుత్వం ఇప్పటివరకు ప్రారంభించలేదు. గైడ్ లైన్స్ నూ ప్రకటించలేదు. 2021 ఆగస్టు నుంచే కొత్త పెన్షన్లు ఇస్తామని సిరిసిల్ల పర్యటనలో సీఎం కేసీఆరే స్వయంగా ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ఓటరు లిస్టు ఆధారంగా అధికారులు సిద్ధం చేసిన అర్హుల జాబితా ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ.. మీ సేవ కేంద్రాల ద్వారా ఆగస్టు 15 నుంచి 31 వరకు అప్లికేషన్లు స్వీకరించారు. దీంతో సుమారు 9.50 లక్షల మంది అప్లయ్​ చేసుకున్నారు. వారందరూ సెప్టెంబర్ లో ఆసరా పెన్షన్ శాంక్షన్ అవుతుందని భావించినా సర్కార్ పట్టించుకోలేదు. ఆ తర్వాత అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు అక్టోబర్ 1 నుంచి 31 వరకు మరోసారి అప్లికేషన్ పెట్టుకునేందుకు చాన్స్ ఇచ్చింది. దీంతో మరో లక్ష మంది అప్లయ్​ చేసుకున్నట్లు తెలిసింది. ఈ గడువు ముగిసి రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రారంభించలేదు. వీటితోపాటు మూడేండ్లుగా ఏ రకమైన పెన్షన్​కు కూడా లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయడం లేదు. మూడేండ్లలో ప్రమాదాల కారణంగా దివ్యాంగులుగా మారినోళ్లు, భర్తను కోల్పోయి వితంతువులుగా మారినోళ్లు, బోదకాల బాధితులు, 55 ఏండ్లు నిండిన గీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, పాత రూల్ ప్రకారం 65 ఏండ్లు నిండిన వృద్ధులు కలిపి మూడున్నర లక్షల మంది వరకు ఉంటారని అంచనా.  

మూడెకరాల భూ పంపిణీ 3 శాతం దాటలే

భూమి లేని దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ చేస్తామని  సర్కార్​ ప్రకటించి ఏండ్లు గడుస్తున్నా.. ముందట పడ్తలేదు. ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములను అమ్మేసుకుంటున్నప్పటికీ.. దళితులకు ఇచ్చేందుకు మాత్రం భూమి లేదని అంటోందన్న విమర్శలు ఉన్నాయి. 3 లక్షల మందికి 3 ఎకరాల చొప్పున భూమిని ఇస్తామని చెప్పిన సర్కారు.. అందులో కనీసం 3 శాతం మందికి కూడా పంచలేదు. ఈ స్కీమ్ను 2014 ఆగస్టు 15న తెచ్చారు.  ఇప్పటిదాకా 6,950  మందికి 17 వేల ఎకరాల భూమిని మాత్రమే పంపిణీ చేసినట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఇందులోనూ వెయ్యి మందికి రిజిస్ట్రేషన్‌‌‌‌  చేయించకపోవడం, చేసినా డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంలాంటి సమస్యలు ఉన్నాయి.

గొర్ల పంపిణీ సగమే!

రాష్ట్రంలోని గొల్ల, కురుమల కుటుంబంలో 18 ఏండ్లు పైబడిన వాళ్లందరినీ అర్హులుగా గుర్తించి 20 గొర్లు, ఒక పొట్టెలు చొప్పున ఇస్తామని 2017లో ప్రభుత్వం ‘గొర్రెల పంపిణీ’ స్కీమ్ను తెచ్చింది. 7 లక్షల 29 వేల 67 గొల్ల, కురుమ కుటుంబాలకు వర్తింపజేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి లోన్​ తీసుకొని.. 2018 ఎలక్షన్ల ముందు వరకు పంపిణీ చేసింది. ఆ తర్వాత ఆపేసింది. ఉప ఎన్నికలు ఎక్కడ వస్తే అక్కడ స్కీమ్ను అమలు చేస్తున్నట్లు హడావుడి చేసింది. సెకండ్​ ఫేజ్​ గొర్రెల పంపిణీని మొదలు పెట్టాలని గత ఏడాది జులైలో సీఎం కేసీఆర్​ ఆదేశించారు. అయినా.. ఇంతవరకూ అతీగతి లేదు. ఫస్ట్​ ఫేజ్​లో 3 లక్షల 80  వేల యూనిట్లు పంపిణీ చేశారు. ఇంకా 3.50 లక్షల మంది గొల్ల, కురుమలు ఎదురు చూస్తున్నారు. సెకండ్​ ఫేజ్​ కోసం ఎన్సీడీసీ నుంచి రూ. 5 వేల కోట్లు లోన్ తీసుకునేందుకు చేసిన ప్రపోజల్స్​ ఇంకా అప్రూవ్​ కాలేదు. అప్పు తీసుకుని అమలు చేసే ఈ స్కీమ్ కూడా ఆగిపోయినట్లేనా అని చర్చ జరుగుతున్నది.

ఈసారీ హెల్త్​ ప్రొఫైల్ ​లేనట్లే 

రాష్ట్రంలో అందరికీ హెల్త్​ టెస్టులు, ఈఎన్​టీ చెకప్​లు చేసి రాష్ట్ర హెల్త్​ ప్రొఫైల్​ రూపొందిస్తామని నాలుగేండ్ల నుంచి ప్రభుత్వం చెప్తూనే ఉంది. ఇప్పటికీ దాన్ని మొదలు పెడ్తలేదు. బ్లడ్​ టెస్టులు చేసి, హెల్త్​ ప్రొఫైల్​ నమోదు చేసేందుకు రూ.1,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా.  సిరిసిల్ల, పైలట్​ ప్రాజెక్టుగా ములుగు జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ మొదలు పెట్టనున్నట్లు 2021 జూన్ 8న కేసీఆర్ ప్రకటించారు. అయితే.. టెస్టులకు కావాల్సిన బడ్జెట్ ఇవ్వకపోవడంతో విడుదల చేయకపోవడంతో అడుగుముందుకు పడలేదు. ఈ ఏడాదిలోనూ హెల్త్​ ప్రొఫైల్​ పూర్తి చేసే సూచనలు కనిపిస్తలేవు.

నిరుద్యోగ భృతి విధివిధానాలకే దిక్కులేదు

2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 3,016 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు టీఆర్​ఎస్​ హామీ ఇచ్చింది. 2020-21 బడ్జెట్​లో  నిరుద్యోగ భృతి కోసం  ప్రభుత్వం రూ. 1,810 కోట్లు కేటాయించింది. అయితే కరోనా కారణంగా అమలు చేయలేకపోయమని ఆ తర్వాత చెప్పింది. 2021-22  బడ్జెట్​ సమావేశాల్లో నిరుద్యోగ భృతి కోసం త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తమని తెలిపింది. ఎవరిని నిరుద్యోగులుగా గుర్తించాలనే దానిపై స్టడీ చేస్తమని పేర్కొంది. విధివిధానాలు, స్టడీపై ఒక్కసారి కూడా చర్చించలేదు. ఇటు ఉద్యోగ ఖాళీలూ భర్తీ చేయడం లేదని, అటు భృతి ఇవ్వడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు.

మూడేండ్లయినా రుణమాఫీ కాదాయె

రెండోసారి అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామన్న రూ. లక్ష రుణమాఫీ ఇప్పటికీ పూర్తి కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా​40.66 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 25,936 కోట్ల క్రాప్​లోన్స్​ ఉండగా, గడిచిన మూడేండ్లలో 4 లక్షల మంది రైతులకు రూ. 732.24 కోట్లు మాత్రమే ప్రభుత్వం మాఫీ చేసింది. ఇంకా 36.66 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 25,203 కోట్లను మాఫీ చేయాల్సి ఉంది. వరుసగా రెండు సార్లు బడ్జెట్​లో రూ. 6 వేల కోట్ల చొప్పున కేటాయింపులు చూపినప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో రిలీజ్​ చేయలేదు. దీంతో కొత్త క్రాప్​ లోన్ల కోసం రైతులు పాత బకాయిలు, వాటి వడ్డీలకు అప్పులు చేసి చెల్లించాల్సి వస్తోంది.