3 లక్షల మందికి ఉపాధి ముచ్చట ప్రశ్నార్థకం

3 లక్షల మందికి ఉపాధి ముచ్చట ప్రశ్నార్థకం
  • ఇంకా షురూ కాని భూసేకరణ
  • రెండింటి దగ్గర్నే ఆగిన లాజిస్టిక్ పార్కులు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్రై పోర్టుల ఏర్పాటుకు ఏండ్లు గడిచినా అడుగు ముందుకు పడలేదు. లాజిస్టిక్స్ రంగంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, డ్రై పోర్టులు, ట్రక్ డాక్ పార్కింగ్ సహా ఇతర సౌలతులను పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. సుమారు1,400 ఎకరాల్లో భారీ డ్రై పోర్టు (మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు)ను పబ్లిక్​– ప్రైవేటు పార్ట్​నర్​షిప్ పద్ధతిలో ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కానీ ఇప్పటిదాకా ఎకరం కూడా సేకరించలేదు. రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే టార్గెట్ గా గత ఆగస్టులో లాజిస్టిక్స్ పాలసీని కూడా సర్కార్ ప్రకటించింది. ఉమ్మడి జిల్లాల్లో ఒక్కోటి చొప్పున10 లాజిస్టిక్ పార్కులు, రెండు ఇంటిగ్రేటెడ్ కంటెయినర్ డిపోలను ఏర్పాటు చేస్తామని చెప్పింది. వీటి ద్వారా లక్ష, పరోక్షంగా రెండు లక్షలు.. మొత్తంగా మూడు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సర్కారు పేర్కొంది. కానీ ఇప్పటి వరకు రెండు లాజిస్టిక్ పార్కులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి.

భూసేకరణ చేయలే

సముద్ర మార్గం లేని ప్రాంతాల్లో సరుకు రవాణాను సులభతరం చేసి రవాణా వ్యయాన్ని తగ్గించడమే డ్రై పోర్టుల ఉద్దేశం. రైలు, రోడ్డు మార్గాలకు సమీప స్థలాల్లో వీటిని ఏర్పాటు చేస్తుంటారు. సంగారెడ్డిలోని జహీరాబాద్, యాద్రాది జిల్లా గుండ్రాంపల్లి డ్రై పోర్టులకు బాగుంటాయని అధికారులు గతంలోనే ఓ అంచనాకు వచ్చారు. కానీ ఇప్పటివరకూ ఎక్కడా స్థలాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించలేదు. అందుబాటులో ఉన్న భూముల గురించి స్థానిక రెవెన్యూ అధికారులతో కూడా చర్చించలేదు. ఇక ఏడాదిన్నర కిందట వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కోర్టు, జైలు ప్రాంతాలను కూడా పరిశీలించినా భూసేకరణ చేయలేదు.

రెండు అందుబాటులోకి.. 

లాక్​డౌన్ సమయంలో త్వరితగతిన లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం హడావుడి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా లాజిస్టిక్​ పార్కుల కోసం 1,060 ఎకరాల భూమి అవసరమని అంచనా వేసింది. పబ్లిక్​–ప్రైవేటు పార్ట్​నర్​షిప్​లో ఇబ్రాహీంపట్నంలోని మల్లంపల్లి, హైదరాబాద్–విజయవాడ హైవే సమీపంలోని బాటసింగారంలో లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం తరఫున ఈ పార్కులకు హెచ్ఎండీఏ స్థలం కేటాయించింది. సనత్ నగర్​లో ప్రస్తుతం ఉన్న కాంకర్ ఐసీడీ తరహాలో కొత్తగా మరో రెండు ఇంటిగ్రేటెడ్ కంటెయినర్ డిపో(ఐసీడీ)లను ఏర్పాటు చేస్తామని చెప్పినా, అవి కూడా ఇంకా ఏర్పాటు కాలేదు. అయితే, డ్రై పోర్టుల నిర్మాణం, కంటెయినర్ డిపోల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారంగానీ, ప్రతిపాదనలుగానీ రాలేదని కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు.

కంపెనీలు ముందుకొస్తున్నయ్

లాజిస్టిక్ పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూపు సహా పలు కంపెనీలు ముందుకు వచ్చాయి. చర్చలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో రెండు డ్రైపోర్టుల ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది. ఉమ్మడి నల్గొండ, జహీరాబాద్ అనువైన ప్రదేశాలుగా గుర్తించాం. భూసేకరణ జరగాల్సి ఉంది.

- జి.రాజేందర్ రెడ్డి,

డైరెక్టర్, లాజిస్టిక్స్, డిపార్ట్​మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, తెలంగాణ