తొలి దశలో 9 వేల స్కూళ్లు.. రూ.3 వేల కోట్ల ఖర్చు

తొలి దశలో 9 వేల స్కూళ్లు.. రూ.3 వేల కోట్ల ఖర్చు
  • ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలుకు సర్కారు గైడ్‌లైన్స్ జారీ

తెలంగాణలో సర్కారు స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ‘మన ఊరు మన బడి’ స్కీమ్ అమలుపై ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమం ద్వారా స్కూళ్లలో ఎటువంటి వసతులు కల్పించాలి, ఏయే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్న అంశాలపై గైడ్‌లైన్స్‌తో జీవో విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మొదటి దశలో భాగంగా 9,123 స్కూళ్లను అభివృద్ధి చేయాలని అందులో పేర్కొంది. టాయిలెట్లు, కరెంట్, తాగునీరు, స్టాఫ్‌తో పాటు విద్యార్థులు కూర్చోడానికి అవసరమైన బల్లలు, ఇతర ఫర్నీచర్, స్కూళ్లకు పెయింటింగ్, మేజర్, మైనర్ రిపేర్లు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీ గోడ, కిచెన్ షెడ్డులు, పాడుబడిన వాటి ప్లేస్‌లో కొత్త క్లాస్‌ రూమ్స్, హైస్కూళ్లలో డైనింగ్ హాల్స్, డిజిటల్ ఎడ్యుకేషన్‌కు అవసరమైన వసతులు వంటి 12 అంశాలను ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం కింద చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తొలి దశలో రూ.3,497 కోట్ల ఖర్చు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో అవసరమైన ఈ మౌలిక వసతుల కల్పనకు రూ.7,289 కోట్ల బడ్జెట్ అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే దశల వారీగా పనులు చేపట్టాలని నిర్ణయించిన సర్కారు.. మొదటి దశలో 9,123 స్కూళ్లకు రూ.3,497.62 కోట్లు ఖర్చవుతాయని భావిస్తోంది. స్కూళ్ల వారీగా అవసరమైన పనులకు జిల్లా కలెక్టర్లు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన జీవోలో పేర్కొంది. అయితే దశల వారీ ఆయా జిల్లాల్లో చేపట్టే పనులకు సంబంధించి ఒక్కో స్కూల్‌ను ఒక్కో యూనిట్‌గా తీసుకుని అయినా పనులు చేయొచ్చని లేదంటే జిల్లా మొత్తాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఏదైనా ఏజెన్సీకి అప్పగించవచ్చని కలెక్టర్లకు సూచించింది.

మరిన్ని వార్తల కోసం..

ఒవైసీ కారుపై కాల్పులు.. ఇద్దరి దుండగుల్లో ఒకరి అరెస్ట్

ప్రధాని మోడీ మాట తప్పారు

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు రూ.3 వేల కోట్లు