కార్మికులు రెడీగా ఉన్నా స్పందించని సర్కార్
తనకేం తెలియదంటున్న మంత్రి పువ్వాడ అజయ్
ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ మౌనం
సీఎం పిలుపు కోసం అధికారుల ఎదురుచూపులు
బంద్ పరిస్థితులపై సీఎం ఆరా
కోర్టు కాపీ అందలేదంటున్న
సీఎంవో వర్గాలు
హుజూర్ నగర్ పోలింగ్
తర్వాతే చర్చలకు చాన్స్
హైదరాబాద్, వెలుగు: శనివారం ఉదయం పదిన్నర నుంచి ఆర్టీసీ కార్మికులతో చర్చలు మొదలుపెట్టాలని హైకోర్టు సూచించినా ఆర్టీసీ యాజమాన్యం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించలేదు. ఆ వైపుగా అడుగులు కూడా వేయలేదు. తాము రెడీగా ఉన్నామని కార్మికులు ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి కదలిక లేదు. దీనిపై ఇటు ఆర్టీసీ మేనేజ్ మెంట్లో, అటు రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరిని అడిగినా తమకేం తెలియదంటున్నారు. అంతా ముఖ్యమంత్రే చూసుకుంటున్నారని చెప్తున్నారు. సీఎం ఇంతవరకు ఏం చెప్పలేదని, అసలు ప్రగతిభవన్ నుంచి తమకు పిలుపే రాలేదని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఆయన ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని సమాధానమిస్తున్నారు. ‘‘మాకేం తెల్వదు. కార్మికులతో చర్చలు జరపండని పైనుంచి ఆదేశాలు రాలేదు. ఆర్టీసీ సమ్మెపై మొదట్నించి ఏం చేయాలో ముఖ్యమంత్రే చెప్తున్నారు. చర్చల విషయంలో ఏం చేయాలో ఇప్పటికైతే ఆయన మాకు ఏమీ చెప్పలేదు’’ అని ఆర్టీసీ లోని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
నోరు విప్పని మంత్రి, ఇన్చార్జి ఎండీ!
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కూడా చర్చల విషయంలో తనకు ఏమీ తెలియదనే తీరుగానే ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రగతి భవన్ నుంచి ఏ క్షణమైనా పిలుపు రావొచ్చని, చర్చల విషయంలో సీఎం ఏమైనా డైరెక్షన్ ఇస్తారని ఆయన ఉదయం నుంచి ఎటు వెళ్లకుండా ఇంట్లోనే ఎదురుచూశారని ఓ నాయకుడు తెలిపారు. సీఎం నుంచి పిలుపు రావొచ్చనే అంచనాతో అధికారులను ఆఫీసులోనే ఉండాలని మంత్రి ఆదేశించారు. ఉదయం 9 గంటలకు ఖైరతాబాద్ లోని మంత్రి ఆఫీస్‌కు వచ్చిన అధికారులు రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఇక ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ కూడా ఉదయం నుంచి ఎర్రమంజిల్‌లోని తన ఆఫీసులో ఉన్నారు. ప్రగతిభవన్ నుంచి ఫోన్ కాల్ వస్తుందని ఆయన కూడా ఎదురుచూశారు. కానీ ఎలాంటి ఫోన్ రాలేదు.
కోర్టు కాపీ అందలేదంటున్న సీఎంవో
ఆర్టీసీ చర్చల విషయంలో ఏం చేస్తారని సీఎంవో వర్గాలను అడిగితే.. ఇంతవరకు ప్రభుత్వానికి హైకోర్టు ఆర్డర్ కాపీ రాలేదని తెలిపాయి. ‘‘కోర్టు ఆదేశాలు ఇంకా అందలేదు. కోర్టు అసలు ఏం చెప్పిందో తెలియకుండా ఎలా చర్చలు జరుపుతాం. సీఎం కూడా కోర్టు లిఖితపూర్వక ఆదేశాలు చూశాకనే మాట్లాడుదాం అన్నారు’’అని ఓ సీనియర్ అధికారి చెప్పారు. కోర్టు ఆర్డర్ కాపీ కోసం అందరం ఎదురు చూస్తున్నామని తెలిపారు.
హుజూర్ నగర్ పోలింగ్ తర్వాతే..
ఆదివారం సెలువు కావడంతో సోమవారం ఆర్టీసీ సంస్థకు కోర్టు ఉత్తర్వులు అందే అవకాశం ఉంది. అయితే సోమవారం హుజూర్ నగర్ లో పోలింగ్ ఉంటుంది. సీఎం ఆ రోజంతా పోలింగ్ పైనే దృష్టి పెట్టే చాన్స్ ఉందని ఓ నాయకుడు చెప్పారు. కోర్టు కాపీ చదివినా పోలింగ్ తర్వాతే అంటే సోమవారం రాత్రి, లేకపోతే మంగళవారం చర్చలపైన అధికారులతో సమీక్ష చేసే చాన్స్ ఉందని అన్నారు. అయితే ఆర్టీసీ కార్మికులతో యాజమాన్యం అర్జెంట్‌గా చర్చలు జరపాల్సింది ఏం లేదని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఏం చర్యలు తీసుకున్నారో ఈ నెల 28న రిపోర్ట్ ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యానికి కోర్టు గడువు ఇచ్చిందని, ఆలోపు ఎప్పుడో ఒక రోజు చర్చల ప్రక్రియ ప్రారంభించే చాన్స్ ఉందని సదరు అధికారి అభిప్రాయపడ్డారు.
పొడిగించిన దసరా సెలవులు ముగియడంతో సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు పనిచేయనున్నాయి. దీంతో ఇప్పటివరకు వాడుకున్న ప్రైవేటు స్కూల్స్ బస్సులను, ప్రైవేటు కాలేజీల బస్సులను వెనక్కి పంపాలని రవాణా శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
బంద్పై సీఎం ఆరా
సీఎం కేసీఆర్ శనివారం అంతా ప్రగతిభవన్ లోని ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బంద్ ఎలా జరుగుతుందో ఆరా తీసినట్లు తెలిసింది. ఉదయం నుంచి ఆయన ఎప్పటికప్పుడు డీజీపీతో ఫోన్ లో మాట్లాడుతూ డైరెక్షన్ ఇచ్చినట్లు సమాచారం. ఆందోళనకారులు ఎవరు రోడ్డుమీదికొచ్చినా అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఇక సొంత నియోజకవర్గం గజ్వేల్ డిపోలో అన్ని బస్సులను తిప్పాలని సీఎం ఆదేశించారని సమాచారం. దీంతో పోలీసులు గజ్వేల్ డిపోలోని అన్ని బస్సులను బయటికి తీశారు. బస్సుకో ఇద్దరు కానిస్టేబుల్ పెట్టి మరి నడిపించారు.

