కేసీఆర్ హర్ ఘర్ మద్యం అంటున్నరు: బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్

కేసీఆర్ హర్ ఘర్ మద్యం అంటున్నరు: బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ హర్ ఘర్ తిరంగ నిర్వహిస్తుంటే.. కేసీఆర్ హర్ ఘర్ మద్యం అంటున్నారని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. మద్యం దుకాణాలను పొందేందుకు దరఖాస్తు పెట్టుకోవాలంటే సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మాజీ సీఎస్, ప్రస్తుత సీఎం సలహాదారు సోమేశ్ కుమార్ సీఎం కేసీఆర్ పక్కన శకునిలా ఉన్నారని ధ్వజమెత్తారు. దేశంలోనే అత్యధికంగా మద్యం రేట్లు ఉన్న రాష్ట్రం తెలంగాణే అని అన్నారు.
 బుధవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో  మీడియాతో మాట్లాడారు. మద్యం దుకాణం దరఖాస్తు కోసం రూ.2 లక్షలునాన్ రిఫండ్ ఫీజు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ దరఖాస్తుల పేరుతో  రూ.వందల కోట్లు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. గౌడ్​లకు సంబంధించి రిజర్వేషన్ కేటాయించిన దుకాణాలను గీత కార్మిక సొసైటీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు సంబంధించి రిజర్వేషన్ చేసిన మద్యం దుకాణాలకు టెండర్ వేయడానికి రూ.25 వేలు మాత్రమే పెట్టాలని కోరారు. 
ఎలాంటి టెండర్లు లేకుండా నిర్వహించే ఎలైట్ షాప్స్ కేవలం కేసీఆర్ బినామీలే తీసుకుంటున్నారని ఆరోపించారు. పేద, మధ్య తరగతి ప్రజల ప్రాణాలను హరించే  బెల్ట్ షాప్ లను వెంటనే  తొలగించాలని డిమాండ్ చేశారు.