భారీ వర్షాలతోనే మేడిగడ్డ కుంగింది..అది డిజైన్లు, ఇంజనీరింగ్ వైఫల్యం కాదు..హైకోర్టులో కేసీఆర్, హరీశ్ తరఫు వాదనలు

భారీ వర్షాలతోనే మేడిగడ్డ కుంగింది..అది డిజైన్లు, ఇంజనీరింగ్ వైఫల్యం కాదు..హైకోర్టులో కేసీఆర్, హరీశ్ తరఫు వాదనలు
  • కమిషన్​ రిపోర్ట్​ రద్దు చేయాలని, తుది తీర్పు కంటే ముందు తమపై చర్యలు తీస్కోకుండా చూడాలని వినతి
  • ప్రజల సొమ్ము నీళ్లలెక్క ఖర్చుపెట్టినా నీళ్లు ఎత్తిపోయలేని దుస్థితి: రాష్ట్ర ప్రభుత్వం
  • కమిషన్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి  చర్చిస్తం 
  • పిటిషనర్లు ఇద్దరూ ఎమ్మెల్యేలే.. వాళ్ల వర్షన్​ అసెంబ్లీలో చెప్పుకోవచ్చని వెల్లడి
  • అసెంబ్లీలో చర్చించి చర్యలు తీస్కుంటరా..  తీసుకున్నాక చర్చిస్తరా? అని హైకోర్టు ప్రశ్న
  • విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాల కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో ఒక పిల్లర్​ కుంగిందని హైకోర్టు ముందు కేసీఆర్​, హరీశ్​ రావు తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. బ్యారేజీ కుంగడానికి డిజైన్లు, ఇంజనీరింగ్​ వైఫల్యం కారణం కాదని పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ను అప్రతిష్ఠపాలు చేసేందుకే జ్యుడీషియల్​ కమిషన్​ వేసి విచారణ జరిపించారని వారు ఆరోపించారు. జస్టిస్​ ఘోష్​ కమిషన్​ ఇచ్చిన రిపోర్టును రద్దు చేయాలని.. తుది తీర్పు చెప్పేలోగా పిటిషనర్లపై చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విన్నవించారు. 

నిబంధనలకు విరుద్ధంగా కమిషన్​ ఏర్పాటు జరిగిందని, సాక్షులను క్రాస్​ ఎగ్జామినేషన్​ చేయకుండానే రిపోర్టును కమిషన్​ ఇచ్చిందని వారు వాదించారు. కాళేశ్వరం కమిషన్​ ఇచ్చిన రిపోర్టును రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్​ రావు ఇటీవల హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు  చేశారు. 

ఆ పిటిషన్లపై గురువారం హైకోర్టు చీఫ్​ జస్టిస్​ అపరేశ్​ కుమార్​ సింగ్​, జస్టిస్​ జి.ఎం. మొహియుద్దీన్​తో కూడిన డివిజన్​ బెంచ్​ విచారణ చేపట్టింది. కేసీఆర్​, హరీశ్​ రావు తరఫున సుప్రీంకోర్టు సీనియర్​ అడ్వకేట్లు ఆర్యం సుందరం, దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. విచారణ కమిషన్​ నివేదిక ఏకపక్షంగా ఉందని వారు ఆరోపించారు. ‘‘సాక్షిగా విచారణకు పిలిచారు. వివరణ కోరితే కమిషన్​కు వివరాలు సమర్పించారు. ఇతర సాక్షులు అభియోగాలు చేసి ఉంటే ఎంక్వయిరీస్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌-1952లోని సెక్షన్‌‌‌‌‌‌‌‌ 8-బి కింద పిటిషనర్లకు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, కమిషన్​ ఆ సెక్షన్​ కింద నోటీసులు ఇవ్వలేదు. 

కేసీఆర్​, హరీశ్​ రావు ఘోరమైన తప్పులు చేసినట్టుగా కమిషన్​ నివేదికలో పేర్కొనడం అన్యాయం. ఇతరుల ఆరోపణలకు వివరణ ఇచ్చే ఆస్కారం ఇవ్వలేదు. అలాంటి వాళ్లను క్రాస్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామినేషన్​ చేయడానికి నోటీసులు ఇవ్వాలన్న నిబంధనను కమిషన్‌‌‌‌‌‌‌‌ ఉల్లంఘించింది. కమిషన్‌‌‌‌‌‌‌‌ విచారణకు ఆఖరి సాక్షి కేసీఆర్.  అప్పటికే ఎవరైనా ఆరోపణలు చేసి ఉంటే ఆ విషయాలపై కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను కమిషన్‌‌‌‌‌‌‌‌ ప్రశ్నించలేదు” అని కేసీఆర్, హరీశ్​రావు తరఫు లాయర్లు వాదించారు. 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేనిపోని విమర్శలు

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరంపై లేనిపోని విమర్శలు చేసిందని, అధికారంలోకి రాగానే మేడిగడ్డ పిల్లర్‌‌‌‌‌‌‌‌ బీటలు వారడంతో విచారణ కమిషన్‌‌‌‌‌‌‌‌ను నియమించిందని కేసీఆర్, హరీశ్​ తరఫు అడ్వకేట్లు హైకోర్టులో వాదించారు. ‘‘కుట్రతో 2024 మార్చి 14న జీవో 6 ద్వారా కమిషన్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారేజీల ప్రణాళిక, డిజైన్, నిర్మాణంపై కమిషన్‌‌‌‌‌‌‌‌ విచారణ చట్టవ్యతిరేకంగా సాగింది.  కమిషన్‌‌‌‌‌‌‌‌ నిజనిర్ధారణ మాత్రమే చేయాలన్న బేసిక్‌‌‌‌‌‌‌‌ రూల్‌‌‌‌‌‌‌‌ను ఉల్లంఘించింది. ప్రభుత్వానికి కమిషన్‌‌‌‌‌‌‌‌ 650 పేజీల నివేదికను ఇచ్చింది. 

దాని ప్రతి ఇవ్వాలని కోరితే పిటిషనర్లకు ఇవ్వలేదు. రిపోర్టుపై  సీఎం,మంత్రి, ఇతరులు పవర్‌‌‌‌‌‌‌‌పాయింట్‌‌‌‌‌‌‌‌ ప్రజంటేషన్‌‌‌‌‌‌‌‌లో కీలక విషయాలను వెల్లడించారు.  పిటిషనర్లపై దుమ్మెత్తిపోశారు.. ఒక పథకం ప్రకారం రాజకీయంగా పిటిషనర్లను దెబ్బతీయాలనే ప్రయత్నం జరుగుతున్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిగనణనలోకి తీసుకుని కమిషన్‌‌‌‌‌‌‌‌ రిపోర్టును రద్దు చేయాలి. తుది తీర్పు చెప్పేలోగా పిటిషనర్లపై చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి” అని వారు కోరారు.

ప్రజాధనం ఖర్చు పెట్టినా నీళ్లివ్వలేని దుస్థితి: ప్రభుత్వం

కమిషన్​ వద్ద ఉన్న సమాచారం మేరకే విచారణ జరుగుతుందని, అంతేగానీ సెక్షన్​ 8బీ, 8సీ సెక్షన్ల కింద నోటీసులివ్వాలనే నిబంధన ఏమీ లేదని ప్రభుత్వం తరఫున అడ్వకేట్​ జనరల్​ ఎ. సుదర్శన్​రెడ్డి ప్రతివాదనలు వినిపించారు. ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టిన తర్వాత కూడా నీళ్లను లిఫ్ట్​ చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ‘‘కమిషన్‌‌‌‌‌‌‌‌ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి లోతుగా చర్చించాల్సి ఉంది.   పిటిషనర్లు ఇద్దరూ ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో జరిగే చర్చలో అన్ని విషయాలు వాళ్లు చెప్పకునే ఆస్కారం ఉంటుంది” అని పేర్కొన్నారు.

 మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దని, పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. లేదంటే కౌంటర్‌‌‌‌‌‌‌‌ వేస్తామని, గడువు కావాలని విన్నవించారు. కమిషన్‌‌‌‌‌‌‌‌ రిపోర్టును  ప్రభుత్వం వెబ్‌‌‌‌‌‌‌‌సైట్​లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేయదన్నారు. కమిషన్‌‌‌‌‌‌‌‌ తరఫున సీనియర్‌‌‌‌‌‌‌‌ లాయర్‌‌‌‌‌‌‌‌ నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డి వాదిస్తూ.. కమిషన్‌‌‌‌‌‌‌‌ సమగ్రంగా విచారణ జరిపిందని తెలిపారు. పిటిషనర్లు చెప్తున్న సుప్రీంకోర్టు తీర్పులు ఇక్కడ వర్తించవని, కమిషన్‌‌‌‌‌‌‌‌ రిపోర్టుపై జోక్యం అవసరం లేదని పేర్కొన్నారు. 

చర్యలు ఎలా తీస్కుంటరు?: హైకోర్టు

కమిషన్​ రిపోర్టు ఆధారంగా పిటిషనర్లపై చర్యలు ఎలా తీసుకుంటరో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. కమిషన్​ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ చేశాక చర్యలు ఉంటాయా లేక అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందే చర్యలు ఉంటాయో చెప్పాలని అడిగింది.  ‘‘ఇదొక కీలక విషయం. ప్రభుత్వ వివరణపై ఆధారపడి కేసు విచారణ ఉంటుంది” అని హైకోర్టు పేర్కొంది. గురువారం సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించగా.. ఇప్పటికిప్పుడే సమాధానం చెప్పలేమని అడ్వకేట్​ జనరల్​ సుదర్శన్​రెడ్డి తెలిపారు. దీంతో విచారణను శుక్రవారానికి హైకోర్టు వాయిదా వేసింది.