టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో బొంద పెట్టిండు

టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో బొంద పెట్టిండు

కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా: రాష్ట్రంలో కేసీఆర్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని.. అందుకే బీఆర్ఎస్ పార్టీ పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపుతుండని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఖేల్ ఖతం అయిందని.. బీఆర్ఎస్ పేరుతో టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో బొంద పెట్టిండని ఆయన పేర్కొన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో జీవీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి జయంతి వేడుకలు జరిగాయి. దివంగత కాకా వెంకటస్వామి చిత్ర పటానికి ఫౌండేషన్ నేతలు లింగమూర్తి, కిష్టయ్య, సదానందం, ఇతర అంబేద్కర్ సంఘం నేతలు పూలమాలవేసి నివాళులర్పించారు. 

సుల్తానాబాద్ పట్టణంలో కాకా జయంతి

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 93వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కాకా విగ్రహానికి వివేక్ వెంకటస్వామి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివేక్ మాట్లాడుతూ కేసీఆర్ ఎందుకు కొత్త పార్టీ పెడుతున్నాడో ఆయనకు.. టీఆర్ఎస్ వారికే అర్థం కావడం లేదన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తి కేసీఆర్.. ప్రజలను తాగుబోతులను చేసిన వ్యక్తి కేసీఆర్, దేశంలో అత్యంత అవినీతి పరుల్లో నెంబర్ వన్ వ్యక్తి కేసీఆర్.. 8 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వని వ్యక్తి కేసీఆర్...  కాళేశ్వరం ప్రాజెక్టు.. మిషన్ భగీరథ పేరుతో వేలాది కోట్లు అవినీతికి పాల్పడి కల్వకుంట్ల కమీషన్ రావు అయిండు.. ఇక్కడ కమీషన్లు దోచుకున్నది అరగక.. ఢిల్లీకి పోయి చక్రం తిప్పుతాననుకుంటుండు..’’ అని వివేక్ వెంకటస్వామి దుయ్యబట్టారు.

తెలంగాణలో ప్రజలు కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదు కాబట్టే.. డైవర్ట్ చేస్తూ.. మైండ్ గేమ్ ఆడడానికి ఢిల్లీకి వెళ్లడానికి నాటకం ఆడుతుండు అని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ‘‘దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎందుకు వెళ్తున్నాడో టీఆర్ఎస్ వాళ్లకే అర్థం కావడం లేదు. కారు.. సారు.. పదహారు చెప్పి.. 7 సీట్లు ఓడిపోయిండు.. అట్లనే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో బొంద పెట్టిండు’’ అని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.

జమ్మికుంటలో కాకా జయంతి వేడుకలు

కరీంనగర్ జిల్లా  జమ్మికుంటలో కాకా జయంతి  వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీచౌక్  దగ్గర కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి  సేవలను గుర్తు  చేసుకున్నారు.  డిప్లమో  స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో  కొత్తపల్లిలోని  స్పందన అనాధాశ్రమంలో  కేక్ కట్ చేశారు.

పెద్దపల్లిలో కాకా జయంతి వేడుకలు

పెద్దపల్లి జిల్లా  కేంద్రంలో  కాకా జయంతి  వేడుకలను బీజేపీ నాయకులు  ఘనంగా నిర్వహించారు. దివంగత కాకా వెంకటస్వామి చిత్రపటానికి బీజేపీ నాయకులు సురేష్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజల  అభ్యున్నతికి కాకా వెంకటస్వామి నిరంతరం  కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజా  జీవితంలో దివంగత కాకా వెంకటస్వామి చేసిన సేవలను స్మరించుకున్నారు.