ప్రగతి భవన్‌లో కేసీఆర్ నన్ను అవమానించారు

ప్రగతి భవన్‌లో కేసీఆర్ నన్ను అవమానించారు

టీఆర్ ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై  కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ లో తనను… కేసీఆర్ అవమానించారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో  తాను కీలక పాత్రను పోషించానని…సోనియాగాంధీని ఒప్పించడానికి ఎంత కష్టపడ్డానో తనకే తెలుసన్నారు. తన కృషి ఎంతో ఉందనే విషయాన్ని కేసీఆర్ కూడా అనేక సార్లు చెప్పారని తెలిపారు. తెలంగాణ కోసం ఎందరో ప్రాణాలను అర్పించారన్నారు. కేసీఆర్ కేవలం ఓట్లు సాధించే రాజకీయం చేస్తుంటారన్నారు డీఎస్.

కేసీఆర్ కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని తెలిపారు డి.శ్రీనివాస్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నానంటూ తనపై పార్టీ అధిష్టానానికి కవిత లేఖ రాశారని… ఆ లేఖపై సంతకాలు చేసిన ఎమ్మెల్యేలలో సగం మంది తనకు ఫోన్ చేశారని… ఒత్తిడి తట్టుకోలేకే లేఖపై సంతకం చేశామని చెప్పారన్నారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తను పని చేసినట్టైతే… తనను పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు.

బీజేపీలోకి డీఎస్ వెళ్లాలనుకుంటున్నారనే ప్రశ్నకు బదులుగా ఆయన సమాధానమిచ్చారు. బీజేపీలోకి తాను వెళ్లాలనుకుంటే తనను ఎవరు ఆపగలరని ప్రశ్నించారు. తాను ఏ పార్టీలో ఉన్నానో పార్టీ హైకమాండే చెప్పాలని డిమాండ్ చేశారు. కొందరు నాయకుల కారణంగా తాను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు డీఎస్.