కాళేశ్వరంపై టీవీల్లో డిబేట్లు ఏమాయే?.

కాళేశ్వరంపై టీవీల్లో డిబేట్లు ఏమాయే?.
  •     మార్చి12న కరీంనగర్ సభలో ప్రకటన
  •     25 రోజులు దాటిపోయినా గప్‌‌‌‌చుప్‌‌‌‌
  •     లిక్కర్ స్కాంలో తన బిడ్డ కవిత అరెస్ట్‌‌‌‌పైనా మౌనమే 
  •     ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్‌‌‌‌పై స్పందిస్తానని మరో ప్రకటన 

హైదరాబాద్, వెలుగు:  మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై తానే స్వయంగా టీవీ చానెల్స్ డిబేట్లలో కూసొని ప్రజలకు వివరించి చెప్తానన్న మాజీ సీఎం కేసీఆర్.. 25 రోజులు గడుస్తున్నా, ఇప్పటివరకూ ఆ ఊసే ఎత్తడంలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో తన కూతురు, ఎమ్మెల్సీ కవిత గత నెలలో అరెస్ట్ అయితే కూడా ఇప్పటివరకూ ఆయన స్పందించలేదు. కానీ, ఇప్పుడు కొత్తగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రెండ్రోజుల్లో స్పందిస్తానని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో జరిగిన చర్చకు కూడా కేసీఆర్ అటెండ్ కాలేదు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే నల్గొండలో సభ నిర్వహించారు. ‘మేడగడ్డలో ఏముంది బొందలగడ్డ’ అంటూ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై ఎదురుదాడి చేశారు తప్పితే, రూ.వేల కోట్లు పెట్టిన కట్టిన బ్యారేజీ ఎందుకు కుంగిందో ప్రజలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయలేదు. ఫిబ్రవరిలో నల్గొండ సభ కోసం ఫామ్ హౌస్​ దాటి బయటకొచ్చిన కేసీఆర్.. ఆ తర్వాత మార్చి 12న కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన సభకు హాజరయ్యారు. ఆ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మేడిగడ్డ బ్యారేజీలో ఇసుక జారిపోయి రెండు పిల్లర్లు కుంగినయి. దీనికే ప్రళయం బద్దలైనట్టు, దేశం కొట్టుకుపోయినట్టు రాద్ధాంతం చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో నేనే స్వయంగా టీవీల్లో కూసొని కాళేశ్వరం సంగతేంటి? దాన్ని ఎందుకు నిర్మించామో ప్రతి ఇంటికి చేరేలా అన్ని విషయాలు చెప్తా” అని ప్రకటన చేశారు. కానీ, ఏప్రిల్12వ తేదీ దగ్గరపడ్తున్నా ఇప్పటివరకూ ఆయన కాళేశ్వరంపై టీవీ డిబేట్ల ఊసే ఎత్తలేదు. 

రెండ్రోజుల్లో స్పందిస్తరా?

మేడిగడ్డ విషయం తర్వాత, రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు అరెస్టయ్యారు. ఇందులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుండడంతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఇరుకునపడుతోంది. ఎండిన పొలాలను పరిశీలించడం కోసం శుక్రవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌, జగిత్యాల, సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌, సిరిసిల్లలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్‌‌‌‌ గురించి రిపోర్టర్లు అడిగితే.. రెండు, మూడు రోజుల్లో స్పందిస్తానని సమాధానం ఇచ్చారు. ‘‘పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశా. నాకు ఆ బాధ్యత ఉంది. రెండు, మూడు రోజుల్లో కచ్చితంగా ఫోన్ ట్యాపింగ్‌‌‌‌పై క్లారిటీ ఇస్తా. నిజానిజాలు బయటపెడ్తా” అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో కేసీఆర్ ఏం మాట్లాడ్తరోనన్న ఆసక్తి రాజకీయ, పోలీస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే, కాళేశ్వరం లెక్కనే ఇది కూడా ప్రకటనలకే పరిమితమైతదా? లేక కేసీఆర్ స్పందిస్తరా? అన్నది మరో రెండ్రోజుల్లో తేలనుంది. 

కవిత అరెస్ట్‌‌‌‌పైనా మౌనమే

తన బిడ్డ, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌‌‌‌పై కూడా కేసీఆర్ ఇప్పటివరకూ స్పందించలేదు. మార్చి 15న కవిత అరెస్ట్ కాగా.. ఆ రోజు కేటీఆర్‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌రావుతో ఆయన సమావేశం నిర్వహించి ఇద్దరినీ కవిత ఇంటికి పంపించారు. ఆ తర్వాత వాళ్లిద్దరే ఢిల్లీకి వెళ్లి కవిత కేసుకు సంబంధించి లాయర్లతో చర్చలు జరిపారు. జైలుకు వెళ్లి కవితను పరామర్శించారు. తల్లి శోభ కూడా ఢిల్లీకి వెళ్లి ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలిశారు. కానీ, కేసీఆర్ మాత్రం ఇప్పటివరకూ ఆమె అరెస్ట్‌‌‌‌ గురించి నోరు విప్పలేదు. ఆమెను కలవడానికి వెళ్లలేదు. కవితను అరెస్ట్ చేసిన వారం రోజుల తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌‌‌ను కూడా ఇదే కేసులో ఈడీ అదుపులోకి తీసుకుంది. ఆ రోజు మాత్రం కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, ఈ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్‌‌‌‌, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్‌‌‌‌సోరెన్‌‌‌‌ ను, కవితను అరెస్ట్ చేశారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంతకు మించి కవిత అరెస్ట్‌‌‌‌ను నిరసిస్తూ ఒక్క వ్యాఖ్య కూడా కేసీఆర్ నోటి నుంచి గానీ, ప్రకటన రూపంలో గానీ రాలేదు.