పేషెంట్ల భోజనానికి పైసల్లేవు

పేషెంట్ల భోజనానికి పైసల్లేవు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్ల డైట్ కాంట్రాక్టర్లకు రాష్ట్ర సర్కారు‌‌‌‌ బిల్లులు చెల్లించడం లేదు. నిరుడు అక్టోబర్ నుంచి ఇప్పటి వరకూ బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఇన్ని నెలలుగా బిల్లులు పెండింగ్ పెడితే భోజనం పెట్టడానికి డబ్బులు ఎక్కడ్నుంచి వస్తాయని సర్కారును వారు ప్రశ్నిస్తున్నారు. పేషెంట్లు, డాక్టర్లకు నాణ్యమైన భోజనం అందించడానికి డైట్ చార్జీలను పెంచామని ఇప్పటికే అనేకసార్లు చెప్పుకున్న ప్రభుత్వం.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో మాత్రం జాప్యం చేస్తున్నది.

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌‌ పరిధిలో ఉండే జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ పరిధిలో ఉండే గాంధీ, ఉస్మానియా వంటి టీచింగ్ హాస్పిటళ్ల డైట్ బిల్లులను కూడా సర్కారు‌‌ పెండింగ్‌‌లో పెట్టింది. ఇదే విషయమై అధికారులను అడిగితే డబ్బులు రాలేదని, సెక్రటేరియట్ వద్ద ఫైల్  పెండింగ్‌‌లో ఉందని వారం రోజుల్లో క్లియర్‌‌‌‌  అవుతుందని పేర్కొన్నారు. ఇన్ని నెలలుగా అప్పులు చేసి పేషెంట్లకు ఆహారం పెడుతున్నామని, ఇక అప్పు ఇచ్చేవాళ్లు కూడా లేరని హైదరాబాద్‌‌లోని ఓ ప్రధాన హాస్పిటల్‌‌ డైట్  కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా బిల్లులు రాకపోతే తాము చేతులు ఎత్తేయాల్సిన దుస్థితి వస్తుందని, పేషెంట్లకు ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. 

శానిటేషన్, సెక్యూరిటీ కాంట్రాక్టర్ల పరిస్థితీ అలాగే..

కొన్ని ఆస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ కాంట్రాక్టర్ల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. ఒక్కో బెడ్డు శానిటేషన్‌‌ చార్జీని రూ.7500కు పెంచిన ప్రభుత్వం.. ఈ మేరకు బిల్లులు చెల్లించడంలో నెలల తరబడి జాప్యం చేస్తున్నది. వాస్తవానికి మూడు నెలల వరకూ బిల్లులు ఇవ్వకపోయినా ఎలాంటి ఆటంకం లేకుండా కాంట్రాక్టర్  పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి కాంట్రాక్ట్‌‌లోనే ప్రత్యేకంగా నిబంధనలు పొందుపర్చారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఏడు నెలలుగా బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎఫెక్ట్‌‌  పేషెంట్ల భోజన నాణ్యతపై పడుతున్నది.

భోజనం సరిగా పెట్టేలా చూసుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వం హాస్పిటల్ సూపరింటెండెంట్లపై పెట్టింది. భోజన నాణ్యతపై తాము కాంట్రాక్టర్లను ప్రశ్నిస్తే, బిల్లుల గురించి కాంట్రాక్టర్లు తమను ఎదురు ప్రశ్నిస్తున్నారని ఓ సూపరింటెండెంట్‌‌ చెప్పుకొచ్చారు. బిల్లులు రెగ్యులర్‌‌‌‌గా విడుదల చేస్తేనే కాంట్రాక్టర్‌‌‌‌ను నిబంధనల మేరకు నడుచుకునేలా చేయగలం అని ఆయన చెప్పారు.