కేసీఆర్ పథకాలు ఎన్నికల స్టంట్లని తేలిపోయింది: లక్ష్మణ్

కేసీఆర్ పథకాలు ఎన్నికల స్టంట్లని తేలిపోయింది: లక్ష్మణ్
  • దళిత బంధు, గొర్లకు బదులు నగదు బదిలీ ఎన్నికల స్టంట్లని తేలిపోయింది
  • ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా.లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: అబద్ధాల పునాదులపై కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు, ఎంపీ డా.లక్ష్మణ్ ఆరోపించారు. టీఆర్ఎస్ అంటే అబద్ధాల పుట్టగా, కేసీఆర్ అబద్ధాలకు మారుపేరుగా నిలిచారన్నారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు బైపోల్ టైమ్​లో గొర్లకాపరులకు బ్యాంక్ ల్లో నగదు జమ చేస్తామని చెప్పి టీఆర్ఎస్ మోసం చేసిందన్నారు.

సింగరేణి ప్రైవేటీకరణ పేరు చెప్పి సీఎం కేసీఆర్ అసత్యాలను ప్రచారం చేశారన్నారు. ఇటీవల ప్రధాని మోడీ ప్రకటనతో సింగరేణి కార్మికులకు నిజాలు తెలిశాయన్నారు. 2015 లో గనుల విషయంలో కేంద్రం తెచ్చిన చట్ట సవరణకు మద్దతు తెలిపిన టీఆర్ఎస్, ఈ రోజు ఓట్ల రాజకీయాల కోసం విమర్శలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో, సింగరేణిలో ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయి లేకుండా చేస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని టీఆర్ఎస్, కేసీఆర్ కు బుద్ధి చెబుతారని అన్నారు.

మోడీని చూసేందుకు మొఖం చెల్లడం లేదు

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం రాష్ట్రానికి వచ్చిన మోడీని కలిసేందుకు కేసీఆర్​కు మొఖం చెల్లట్లేదని లక్ష్మణ్ అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెచ్చిన దళిత బంధు, గిరిజన బంధు, గొర్ల కాపరులకు నగదు బదిలీ హామీలు ఉట్టి మాటలే అని తేలిపోయాయన్నారు. టెక్స్ టైల్ రంగానికి 5 శాతం జీఎస్టీ విధించాలని కోరిన కేటీఆర్, హరీష్ రావులు  ఇప్పుడు కేంద్రం చేనేతపై జీఎస్టీ విధిస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 

అమిత్ షా బీజీగా ఉన్నారు...

కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ ఎన్నికల్లో బీజీగా ఉన్నారని లక్ష్మణ్ అన్నారు. మరో రెండు, మూడు రోజులు ఆయన ఢిల్లీ వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. జాతీయ పార్టీలో రాష్ట్ర నేతలు ఢిల్లీకి రావడం ఆనవాయితీ అని అన్నారు. హైకమాండ్ పిలుపుతో ముఖ్య నేతలు ఢిల్లీ వచ్చారన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కృష్ణ మృతి పట్ల బీజేపి తరపున ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.