ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆరే.. అసలు ముద్దాయి

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆరే.. అసలు ముద్దాయి
  •  ఏ2 హరీశ్, ఏ3 వెంకట్రామిరెడ్డి: రఘునందన్ రావు
  • కేసీఆర్, హరీశ్, కేటీఆర్ పాస్​పోర్టులు సీజ్ చేయాలని డిమాండ్ 

సంగారెడ్డి, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు ముద్దాయి కేసీఆర్ అని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. ఈ కేసులో ఏ1గా కేసీఆర్​ను, ఏ2 హరీశ్ రావు అని, ఏ3 సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని చేర్చాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే మిగిలిన ఆఫీసర్లను చేర్చాలన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని బీజేపీ జిల్లా ఆఫీస్​లో మంగళవారం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు.

 ‘‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి బాధితుడు రేవంత్ రెడ్డి అయితే.. రెండో బాధితున్ని నేనే. 2015 దుబ్బాక ఉప ఎన్నికలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రమేయంతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. నా కుటుంబ సభ్యుల అందరి ఫోన్లు ట్యాప్ చేసి విన్నారు. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో అప్పుడే రేవంత్ రెడ్డిని జైలుకు పంపించారు. కూతురు పెండ్లికి రేవంత్ రెడ్డి పెరోల్​పై బయటికి రావాల్సిన పరిస్థితి తీసుకురావడం బాధాకరం. దీనంతటికి సూత్రధారి మాజీ సీఎం కేసీఆర్. అప్పటి కేబినెట్ ఆదేశాలతోనే ఫోన్ ట్యా పింగ్ జరిగింది’’అని ఆరోపించారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

ఆ రోజు ఏం మాట్లాడారు..?

మార్చి 19న రాత్రి 10.15 గంటలకు సీఎం రేవంత్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కలిసి ఒకే విమానంలో ప్రయాణించారని రఘునందన్ తెలిపారు. రెండు గంటల పాటు సాగిన జర్నీలో ఏం మాట్లాడుకున్నారో హరీశ్ రావు చెప్పాలన్నారు. ‘‘మెదక్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ గురిచి మాట్లాడారా.. లేక 26 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్​లోకి వస్తానన్న దానిపై చర్చ జరిగిందా చెప్పాలి. సీఎం రేవంత్ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకుంటారో.. లేక నిజాలు తేలుస్తారో చెప్పాలి’’అని కోరారు.