సీఎం కేసీఆర్ ఆలోచనలే దేశానికి ఆచరణ : కేటీఆర్

సీఎం కేసీఆర్ ఆలోచనలే దేశానికి ఆచరణ : కేటీఆర్

 సీఎం కేసీఆర్ ఆలోచనలే దేశానికి  ఆచరణగా మారాయన్నారు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వనపర్తిలో నిర్వహించిన TRS పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ స్వయంగా రైతు అయినందువల్లే రైతు సంక్షేమ పథకాలపై ఎక్కువ దృష్టి పెట్టారన్నారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఇవాళ మన రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టారన్నారు. మన రైతుబంధు పథకాన్ని పేరు మార్చి కేంద్రం అమలు చేస్తోందన్నారు. కేసీఆర్ ఆలోచనలనే ఇవాళ చాలా మంది సీఎంలు అనుసరిస్తున్నారన్నారు. 43లక్షల మందికి ఆసరా ఫింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం మనదేనన్నారు.

ఏప్రిల్ నెల నుంచి పింఛన్ రెట్టింపు చేసి రూ.2వేలు ఇస్తామన్నారు కేటీఆర్. పాలమూరు జిల్లా పచ్చబడుతుంటే విపక్షాలకు కళ్లు ఎర్రబడుతున్నాయన్నారు. మూడేళ్లలోనే ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇస్తుంటే కాంగ్రెస్ నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు. నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అనే పాట ఒకనాటి ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితిని చాటిందని, ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ఉన్నాయన్నారు.

ఇప్పుడు ప్రభుత్వ ఏదో చేస్తారని ఐదేళ్ల క్రితం భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తే మోడీ చేసింది శూన్యమన్నారు. పోలవరానికి జాతీయహోదా ఇచ్చిన కేంద్రం కాళేశ్వరానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఢిల్లీ గద్దెను ఎక్కేది ఎవ‌రో టీఆర్‌ఎస్‌ నిర్ణయించాలని కేటీఆర్‌ వివరించారు.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 స్థానాలను TRS గెలుచుకుంటే నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి, కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి నిధులు సాధించుకోవచ్చన్నారు.