
- గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సహకార సంఘాలు
- ఈ నెల 31న ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభ
- కొత్త జిల్లాల వారీగా సహకార సంఘాల పునర్విభజన
కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలోని గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో పశుసంవర్ధకశాఖ, కో ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్ మధ్య సమన్వయం లేకపోవడంతో ఎన్నికల నిర్వహణను గాలికొదిలేశారు. ఇప్పుడు గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘాల వినతిమేరకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
పదేండ్లుగా నిర్లక్ష్యం
తెలంగాణలో మొత్తం 8,109 ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు ఉండగా, ఇందులో 7,61,895 మంది సభ్యులు ఉన్నారు. పది ఉమ్మడి జిల్లాల్లో గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత గొర్రెల పంపిణీ వంటి స్కీమ్‌లను అమలు చేసినప్పటికీ.. ఎన్నికలు, ఆడిట్ లేక పదేండ్లు కో ఆపరేటివ్ యూనియన్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కొన్ని గ్రామాల్లో రెండేండ్లు, మూడేండ్లకోసారి ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సొసైటీల ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. జిల్లా స్థాయిలో మాత్రం ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు పశుసంవర్ధక శాఖ ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
శాఖల మధ్య సమన్వయలోపం.. సంఘాలకు శాపం
గ్రామ, జిల్లా స్థాయి గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల ఎన్నికలను గతంలో పశుసంవర్ధక శాఖనే నిర్వహించేది. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత సభ్వత్యాల నమోదు, ఓటరు జాబితా వరకే పశుసంవర్ధక శాఖను పరిమితం చేసి, సొసైటీ ఎన్నికల నిర్వహణను కోఆపరేటివ్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగిస్తూ గత సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రెండు శాఖల ఆఫీసర్ల మధ్య సమన్వయం కరువై, ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ సంఘాల ఎన్నికలను గాలికొదిలేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత 32 జిల్లాల్లో గొర్రెల పెంపకందారుల కోఆపరేటివ్ యూనియన్ ఎలక్షన్లు జరగాల్సి ఉండగా.. ఒక్క వనపర్తి జిల్లాలో మాత్రమే నిర్వహించారు.
ఉమ్మడి కరీంనగర్‌తో మొదలు
రాష్ట్రంలో తొలిసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ 18వ వార్షిక మహాసభను ఈ నెల 31న నిర్వహించబోతున్నారు. ఇందులో 2017– 18 నుంచి 2023 – 24 వరకు ఆడిట్ నివేదిక, ఆదాయ వ్యయాలపై చర్చించి ఆమోదించనున్నారు. అలాగే సంఘాన్ని కొత్త జిల్లాల వారీగా విభజించేందుకు యూనియన్ బైలాలో మార్పులు చేయనున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంఘం నుంచి కొత్తగా ఏర్పడిన కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో కలిసిన కొన్ని మండలాలకు సంబంధించిన డిపాజిట్లు, డిపాజిట్ల మీద వచ్చిన వడ్డీని జిల్లా సంఘాలకు డీడీ/ఆర్టీజీఎస్/నెఫ్ట్ ద్వారా చెల్లించనున్నారు. ఈ మార్పుల తర్వాత త్వరలోనే ఆయా జిల్లాల్లోని ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల అధ్యక్షులు/పర్సన్ ఇన్‌చార్జులు 11 మంది డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. వారిలోనే ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకోనున్నారు.
మహాసభకు తరలిరండి
కరీంనగర్ పద్మానగర్‌లోని ఇందిరా గార్డెన్స్‌లో ఈ నెల 31న ఉదయం 11 గంటలకు నిర్వహించే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభకు గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల అధ్యక్షులు, పర్సన్‌ఇన్‌చార్జులు తరలిరావాలి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పదేండ్లు బైలాస్ ప్రకారం ఎన్నికలు నిర్వహించలేదు. ఈ అవకాశాన్ని గొర్రెల పెంపకందారులు వినియోగించుకోవాలని ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి సందబోయిన ప్రసాద్ యాదవ్ తెలిపారు.