సాగుకు ఊతం .. ఉమ్మడి నల్గొండ జిల్లా సాగునీటి ప్రణాళిక ఖరారు

సాగుకు ఊతం .. ఉమ్మడి నల్గొండ జిల్లా సాగునీటి ప్రణాళిక ఖరారు
  • 9,23,449 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళికలు  
  • ఇప్పటికే సాగర్, మూసీ కాల్వలకు నీటి విడుదల 

నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పంటలకు సాగునీరు అందించేందుకు నీటిపారుదల శాఖ సన్నద్ధమవుతోంది. ఇటీవల హైదరాబాద్​లో నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటి విడుదల ప్రణాళికను రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ ఖరారు చేసింది. వానాకాలంలో మొత్తం 9,23,449 ఎకరాల్లో పంట సాగుకు నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ, ఆసీఫ్ సహర్, డిండి, ఎస్సారెస్పీ స్టేజ్-2, మూసీ, ఎత్తిపోతల పథకాల కింద నీటిని విడుదల చేసేందుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీటిని వృథా చేయకుండా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి పాటించాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ మేరకు జిల్లాలోని సాగునీటి పారుదలశాఖ అధికారులు షెడ్యూల్ ఖరారు చేసి నీటిని విడుదల చేయనున్నారు.  

9,23,449 ఎకరాల్లో సాగు..

నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని 9,23,449 ఎకరాలకు సాగునీరు అందించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద నల్గొండ జిల్లాలో 1,44,727 ఎకరాల ఆయకట్టు ఉండగా, వానాకాలం సాగుకు 16.50 టీఎంసీల నీటిని కేటాయించారు. ఏఎమ్మార్పీ, ఎస్ఎల్బీసీ కింద 2,76,461 ఎకరాల ఆయకట్టు ఉండగా, 28 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. ఆసిఫ్ సహర్ కింద 15.245 ఎకరాలకు 1.5 టీఎంసీల నీరు కేటాయించారు. డిండి ప్రాజెక్టు కింద 12,975 ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించిన కమిటీ వచ్చే ఇన్ ఫ్లో ఆధారంగా ఎంత నీటిని విడుదల చేయాలన్నది నిర్ణయించాలని స్పష్టం చేసింది. 

సూర్యాపేట జిల్లాలో సాగర్ ఎడమ కాల్వ కింద ఎత్తిపోతల పథకాలతో కలుపుకొని 2,29,961 ఎకరాల ఆయకట్టు ఉండగా, వానాకాలం సాగుకు 18 టీఎంసీల నీటిని కేటాయించింది. ఎస్సారెస్పీ స్టేజ్-–2 కింద సూర్యాపేట జిల్లాలో 2,14,080 ఎకరాలకు నీటిని ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. అయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చే ఇన్ ఫ్లో ఆధారంగా ఎంత నీటిని విడుదల చేయాలన్నది ఖరారు చేయాలని సూచించింది. మూసీ ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలకు 4.28 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది.

మూసీ ఆయకట్టుకు నీటి విడుదల..

జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో అతి పెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో వానాకాలం ఆరుతడి పంటల సాగుకు మూడు రోజుల క్రితం కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తుండగా, తొలి విడత 25 రోజులు ఆ తర్వాత మూడు విడతలు ఒక్కో విడతకు 15 రోజుల విరామంతో 15 రోజులపాటు మొత్తం 79 రోజులు నీరిచ్చే విధంగా షెడ్యూల్ రూపొందించారు. 

మొదటి విడత ఈనెల 18 నుంచి ఆగస్టు 12 వరకు, రెండో విడత ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు, మూడో విడత సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 11 వరకు, నాలుగో విడత అక్టోబర్ 26 నుంచి ప్రాజెక్ట్ లో నీరు ఉన్నంత వరకు కాల్వలకు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

వరద ఆధారంగా నీటి విడుదల..

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కు ఎగువ నుంచి 67,585 క్యూసెక్కుల వరకు ఇన్​ఫ్లో వస్తోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 590 అడుగులకు 568.20 అడుగులకు చేరింది. ఈ నాలుగైదు రోజుల్లో వర్షాలు పెరిగి శ్రీశైలం నుంచి సాగర్ ఇన్ ఫ్లో ఎక్కువగా ఉంటే త్వరలోనే ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. లేదంటే ఆగస్టు 1 నుంచి సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. ఇప్పటికే తాగునీటి అవసరాల కోసం వెయ్యి క్యూసెక్కుల నీటిని ఎడమ కాల్వకు విడుదల చేస్తున్నారు.