రేషన్ కార్డు అంటేనే ఆహార భద్రత..డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

రేషన్ కార్డు అంటేనే ఆహార భద్రత..డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

మధిర, వెలుగు : రేషన్‌‌ కార్డు అంటేనే ఆహార భద్రత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా బోనకల్లులో సోమవారం జరిగిన కొత్త రేషన్‌‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అత్యంత పేదలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన మధ్య తరగతి వర్గాలకు కూడా కాంగ్రెస్‌‌ ప్రభుత్వంలో రేషన్‌‌ కార్డులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలు ఉండగా.. 93 లక్షల కుటుంబాలకు రేషన్‌‌ కార్డులతో పాటు సన్నబియ్యం అందజేస్తున్నామన్నారు.

 లబ్ధిదారుల సంఖ్య రీత్యా చూసినా, సన్నబియ్యం వారీగా చూసిన ఆహార భద్రత విషయంలో తెలంగాణ దేశంలోనే రోల్‌‌మోడల్‌‌గా నిలిచిందన్నారు. కొత్త కార్డులు, కుటుంబ సభ్యుల పేర్ల చేర్పులు, మార్పుల కోసం ప్రజలు పదేండ్లు ఎదురుచూశారన్నారు. రేషన్‌‌ కార్డుల పంపిణీని గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.

 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌‌ స్కీమ్‌‌ కింద రాష్ట్రంలోని 51 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయన్నారు. సంక్షేమ కార్యక్రమాలే కాకుండా.. అభివృద్ధి పనులను సైతం పెత్త ఎత్తున చేపడుతున్నామని చెప్పారు. ఆర్‌‌అండ్‌‌బీ శాఖ ద్వారా రూ. 20 వేల కోట్లతో రాష్ట్రంలో రోడ్డు పనులు చేపట్టామన్నారు.