ఇందుకేనా తెలంగాణ సాధించుకుంది

ఇందుకేనా తెలంగాణ సాధించుకుంది
  • ఆర్టీసీ కార్మికుడి ఆత్మాహుతిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కరించాలని నోటీసు ఇచ్చినా సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడం దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మరణం తీరని లోటు అని, కార్మికులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన చెప్పారు. గాంధీ భవన్ లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని అన్నారాయన. పోరాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావడం దారుణమని, దీని కోసమనేనా తెలంగాణ తెచ్చుకున్నది అని ఆవేదన వ్యక్తం చేశారాయన.

ప్రభుత్వం వల్లే ఆత్మహత్యలు

రాష్ట్రంలో ఏమి జరుగుతుందో అర్ధం కావడం లేదని జగ్గారెడ్డి అన్నారు. హుజూర్ నగర్ ఎన్నికల్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ రెడ్డి బిజీగా ఉన్నారని, కమిటీలు.. అధికారుల ద్వారా ఆర్టీసీ కార్మికులతో మాట్లాడించడం కాదని, నేరుగా కేసీఆరే మాట్లాడాలని అన్నారాయన. ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ చర్చలు జరపకుంటే ఈ ఉద్యమం మహా సంగ్రామంగా మారుతుందని హెచ్చరించారు జగ్గారెడ్డి. ఆర్టీసీ కార్మికుడి ఆత్మాహుతికి ప్రభుత్వమే కారణమని ఆయన మండిపడ్డారు.

చరిత్ర హీనుడిగా రవాణా మంత్రి

ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ కు సర్ది చెప్పడంలో రవాణా మంత్రి అజయ్ పువ్వాడ విఫలమయ్యారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రవాణా మంత్రి చరిత్ర హినుడుగా మిగిలి పోతాడని చెప్పారు. మంత్రులకు చేతకాక విసక్షాలపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ‘తెలంగాణ ఆర్టీసీ కార్మికులను తక్కువగా అంచనా వేయొద్దు. వాళ్ల ఉద్యమం మీ పీకల మీదికి వస్తుంది. తొలగించిన ఉద్యోగులను తిరిగి డ్యూటీలోకి తీసుకోండి. లేకపోతే కోర్టును ఆశ్రయిస్తాం’ అని చెప్పారు జగ్గారెడ్డి.