
ప్రైవేట్ టీచింగ్ హాస్పిటళ్లలోనూ కేసీఆర్ కిట్ పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రూపొందిస్తున్న ప్రతిపాదనలను ఆరోగ్యంపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నట్టు హెల్త్ ఆఫీసర్లు వెల్లడించారు. ప్రైవేట్ టీచింగ్ హాస్పిటళ్లకు డెలివరీ కేసులు రాకపోవడంతో, గైనకాలజీ స్టూడెంట్స్‌కు క్లినికల్ ప్రాక్టీస్ దొరుకుతలేదు. మరోవైపు, ప్రభుత్వ దవాఖాన్లు, టీచింగ్ హాస్పిటళ్లలో డెలివరీ కేసులు పెరిగి, డాక్టర్లపై ఒత్తిడి ఎక్కువైతోంది. ఈ అంశాలపై రెండ్రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చ జరిగింది.
కిట్ పథకాన్ని ప్రైవేటు టీచింగ్ హాస్పిటళ్లలోనూ అమలు చేస్తే ప్రభుత్వ దవాఖాన్లపై ఒత్తిడి తగ్గించడంతోపాటు, ప్రైవేటులో చదివే మెడికోలకు న్యాయం జరుగుతుందని మంత్రులు అభిప్రాయపడినట్టు తెలిసింది. అయితే, కేసీఆర్ కిట్ అమలు చేసినా, ఉచితంగా డెలివరీలు చేసేందుకు ప్రైవేటు యాజమాన్యాలు సిద్ధంగా లేవు. అందుకే కిట్ ప్రైవేటు టీచింగ్ హాస్పిటళ్లకు ఇవ్వడం కంటే, అక్కడ చదివే స్టూడెంట్స్ కు ప్రభుత్వ దవాఖాన్లలో డ్యూటీలు చేయడానికి అనుమతివ్వడం మంచిదని హెల్త్ ఆఫీసర్లు
చెబుతున్నారు.