ఏడాది కాలంగా ఆగిపోయిన కేసీఆర్ కిట్ పథకం

ఏడాది కాలంగా ఆగిపోయిన కేసీఆర్ కిట్ పథకం
  • కామారెడ్డి జిల్లాలో రూ.6. 28 కోట్ల బకాయిలు
  • 20,794 మంది లబ్ధిదారుల ఎదురు చూపులు

కామారెడ్డి, వెలుగు: గర్నమెంట్‌ హాస్పిటళ్లలో డెలివరీలు పెంచేందుకు, గర్భిణుల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీర్‌‌ కిట్‌ పథకం ఏడాది కాలంగా ఆగిపోయింది. ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. పైసల కోసం ఎన్ని సార్లు అడిగినా ఆఫీసర్లు సరైన సమాధానం చెప్పడం లేదని అంటున్నారు.

20,794 మందికి..

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 20,794 మందికి కేసీఆర్ కిట్ పైసలు రావాల్సి ఉంది. ఫండ్స్ కొరతతో ప్రభుత్వం లబ్ధిదారులకు సొమ్ము ఇవ్వడం లేదని తెలుస్తోంది.  జిల్లాకు మొత్తం రూ.6,28, 57,000 అమౌంట్ రావాలి. ఇందులో ఫస్ట్ విడతలో 5,950 మందికి రూ .కోటి 78 లక్షల 50 వేలు, 2వ విడత 3,922 మందికి రూ.కోటి 76 లక్షల, 49వేలు, 3వ విడత 5,408 మందికి రూ. కోటి 8 లక్షల 16వేలు, 4వ విడతకు సంబంధించి  5,514 మందికి  రూ. కోటి 65 లక్షల 42 వేల సొమ్ము పెండింగ్‌లో ఉంది. కానీ గత ఏడాది కాలంలో ఏ ఒక్క విడత సొమ్ము కూడా లబ్ధిదారుల అకౌంట్లలో పైసలు జమ కాలేదు. హెల్త్ స్టాఫ్‌ను అడిగితే తమకు తెలియదని చెబుతున్నారని పలువురు లబ్ధిదారులు తెలిపారు.  

భిక్కనూరు మండలం తిప్పాపూర్‌‌కు చెందిన రంగా రమ్య, ప్రశాంత్ దంపతులకు ఇటీవల పాప పుట్టింది. కేసీఆర్ కిట్ ద్వారా వీరికి ఇప్పటికే రూ.8 వేల అమౌంట్ రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు నయా పైసా రాలేదు. ఆఫీసర్లను అడిగితే వస్తాయి అంటున్నారు కానీ ఎప్పుడు అని చెప్పడం లేదు.

ఐదు రోజుల పాపను ఎత్తుకుని ఉన్న వీరు కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లికి చెందిన జగ్గ అశ్విని, ప్రశాంత్. వీరికి ఆడ బిడ్డ పుట్టింది. కేసీఆర్ కిట్‌ ద్వారా రూ.13,000 రావాలి. ఇప్పటికే రెండు విడతలకు సంబంధించి రూ.8 వేలు రావాల్సి ఉన్నా అసలు రాలేదు. వస్తువులతో కూడిన కిట్‌ ఇచ్చారని, హాస్పిటల్‌లో పైసలు గురించి అడిగితే  అకౌంట్‌లో జమ చేస్తారని చెప్పారని, కానీ రాలేదని పేర్కొన్నారు.