ఏం చేద్దాం?..కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై కేటీఆర్, హరీశ్తో కేసీఆర్ మరోసారి భేటీ

ఏం చేద్దాం?..కాళేశ్వరం కమిషన్  రిపోర్టుపై కేటీఆర్, హరీశ్తో కేసీఆర్ మరోసారి భేటీ
  • అసెంబ్లీలో ప్రభుత్వానికి కౌంటర్​ ఎలా ఇవ్వాలన్నదానిపై నోట్స్​
  • ఈసారైనా కేసీఆర్​ వస్తారా? రారా? అని పార్టీ వర్గాల్లో చర్చ

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఏం చేయాలనే దానిపై బీఆర్​ఎస్​ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్​లో కేటీఆర్, హరీశ్​రావుతో కేసీఆర్​వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హైకోర్టులో కమిషన్​ రిపోర్టును రద్దు చేయాలని పిటిషన్​వేయగా..  వారి విజ్ఞప్తిని కోర్టు  తిరస్కరించింది.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెడితే అక్కడే తేల్చుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే మంగళవారం కూడా హరీశ్​రావు, కేటీఆర్​తో కేసీఆర్​సమావేశమయ్యారు. ప్రభుత్వానికి ఎలా కౌంటర్​ ఇవ్వాలన్న దానిపై నేతలు చర్చించినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై నోట్స్​ ప్రిపేర్​ చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. కాగా, ఈ సమావేశాలకు కేసీఆర్​ హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్​ కేవలం రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. 

కొత్త ప్రభుత్వం కొలువుదీరాక ఎమ్మెల్యేలందరూ ప్రమాణం చేసినా.. కేసీఆర్​మాత్రం హాజరు కాలేదు. ఫాంహౌస్​లో కాలుజారి పడడంతో తుంటి ఎముక విరిగి కొన్ని నెలలు ఆయన రెస్ట్​కే పరిమితమయ్యారు. ఆ తర్వాత స్పీకర్​ చాంబర్​లో ప్రత్యేకంగా ఎమ్మెల్యేగా కేసీఆర్​ప్రమాణం చేశారు. 2024 ఫిబ్రవరిలో నిర్వహించిన బడ్జెట్​ సమావేశాలకు హాజరయ్యారు. కేవలం ఒక్కరోజు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. 

ఇప్పుడు అత్యంత కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు, అందులోని అవకతవకలపై జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ చైర్మన్​గా ఏర్పాటు చేసిన కమిషన్​రిపోర్టుపై చర్చించనున్న నేపథ్యంలో కేసీఆర్​ హాజరుపై ఆసక్తి ఏర్పడింది. అసెంబ్లీకి వచ్చి ప్రాజెక్టుపై కేసీఆర్​ సమాధానమిస్తారా.. లేదంటే హరీశ్​ రావుతోనే సమాధానం చెప్పిస్తారా? అన్న చర్చ పార్టీ వర్గాల్లోనూ జరుగుతున్నది. ఈ సమావేశాలకు కూడా కేసీఆర్​ హాజరుకాకపోవచ్చన్న చర్చే ఎక్కువగా జరుగుతున్నది.