అవినీతి తెలంగాణగా మార్చడమే కేసీఆర్ లక్ష్యం

అవినీతి తెలంగాణగా మార్చడమే కేసీఆర్ లక్ష్యం

కేసీఆర్​ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు. బంగారు తెలంగాణ పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా, అవినీతి తెలంగాణగా మార్చడమే  సీఎం ఘనత అని ఎద్దేవా చేశారు. మహిళలకు భద్రత కరువైందని, ప్రజలతోపాటు మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే కేసీఆర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.

 

కేసీఆర్ రెండో టర్మ్​ ఏడాది పాలనపై శుక్రవారం బీజేపీ ఆఫీసులో లక్ష్మణ్​ మీడియాతో మాట్లాడారు. దేశంలో  మహిళలను ఏడిపిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీఆర్​ఎస్​ ప్రభుత్వమేనని అన్నారు. ‘పని మీద రోడ్డు మీదికి వెళ్లిన వారు తిరిగి ఇంటికి వస్తారనే భరోసా లేదు. పొత్తిళ్లలో ఉన్న పసిగుడ్డును ఎత్తుకెళ్లి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఆఫీసుల్లో మహిళా ఉద్యోగులను పెట్రోల్ పోసి కాల్చి చంపుతున్నారు. ఇండ్లలోకి వచ్చి అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఈ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది’ అని మండిపడ్డారు. మహిళల అక్రమ రవాణాలో తెలంగాణ 4వ స్థానంలో ఉందంటే ఆడ పిల్లలకు ఈ ప్రభుత్వం ఏపాటి రక్షణనిస్తుందో అర్థమవుతోందన్నారు.  సీఎం కేసీఆర్ నేరాల నియంత్రణలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యాచారాలు 11 శాతం, కిడ్నాప్ లు 16 శాతం పెరిగాయి..  ఇంకా శాంతి భద్రతలు ఎక్కడివని ప్రశ్నించారు. పూనం మాలకొండయ్య కమిటీ సిఫారసులను ఎందుకు అమలు చేయడంలేదని నిలదీశారు. మొత్తానికి కేసీఆర్ పాలన ‘ఊపర్ షేర్వానీ, అందర్ పరేషానీ’గా సాగుతుందన్నారు. అంగన్ వాడీ కేంద్రాల మూసివేతకు ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మండిపడ్డారు.

ఇదా రైతు సంక్షేమ సర్కార్​?

కేంద్రం ఇచ్చిన ఎరువులను అమ్ముకొని, రైతులను రోజుల తరబడి క్యూలో నిలుచో బెట్టిన ఈ ప్రభుత్వం రైతు సంక్షేమ సర్కార్ ఎలా అవుతుందని లక్ష్మణ్​ ప్రశ్నించారు. కేంద్రం అమలు చేస్తున్న వడ్డీ మాఫీ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా, పావలా వడ్డీ పథకాన్ని ఆగం చేసిన కేసీఆర్.. రైతు సంక్షేమం గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుందన్నారు. రైతు బంధు పథకం కింద గత ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన రూ. 9 వేల కోట్లు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఢోకా లేదన్న సీఎం.. ఇప్పుడు ఆందోళనకరంగా ఉందని, ఖర్చులు తగ్గించుకోవాలనడం ఏంటని ప్రశ్నించారు. 8 నెలల్లో రూ. 224 కోట్ల ఆదాయం తగ్గిందంటున్నారు.. వాస్తవానికి 924 కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 వేల కోట్లు బకాయి పడిందని తెలిపారు.  టీఆర్ఎస్ సర్కార్  నిర్వాకం వల్ల  రాష్ట్ర అప్పులు రూ.3 లక్షల కోట్లకు చేరాయన్నారు. ఆర్థిక మంత్రి లేకుండానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం సమీక్షలు చేస్తున్నారని విమర్శించారు.

హామీల అమలేమైంది?

నిరుద్యోగ భృతి లేదని, ఉద్యోగాలు లేవని, టీఎస్​పీఎస్సీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిందని లక్ష్మణ్ అన్నారు. ఏడాదిన్నరగా ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేదని, వీఆర్వోలను తీసేస్తామంటూ బెదిరిస్తున్నారని, టీచర్లను తొలగిస్తామంటున్నారని, దీంతో రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రశాంతంగా పని చేయలేని పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. నిధులు లేక డబుల్ బెడ్ రూం ఇండ్లు, హరితహారం పనులు మూలకు పడ్డాయని, ప్రజారోగ్యం, విద్యా పథకాలు అమలవడం లేదని తెలిపారు. ఇచ్చిన హామీల అమలు ఏమైందని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే కుంజ సత్యవతి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, నేతలు ఎన్వీ సుభాష్, మాధవి చౌదరి పాల్గొన్నారు.