
మీ వ్యాఖ్యలు విచారణ పూర్తి కాకముందే తీర్పులిచ్చినట్టున్నయ్
మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం
ఎంక్వైరీలో నిష్పాక్షిత ఎంత మాత్రం లేదు
నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు
రాజకీయ కక్షతోనే కమిషన్ ఏర్పాటు చేశారు
హైదరాబాద్: పవర్ కమిషన్ చైర్మన్ నర్సింహారెడ్డి విచారణ తీరును మాజీ సీఎం కేసీఆర్ తప్పు పట్టారు. ఇవాళ జస్టిస్ నర్సింహారెడ్డికి ఆయన 12 పేజీల లేఖ రాశారు. స్వచ్ఛందంగా మీరే విచారణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచించారు. నర్సింహారెడ్డి తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ తన లేఖ పేర్కొన్నారు. విచారణ పూర్తి కాకముందే తీర్పులిచ్చినట్టుగా ఉందన్నారు. రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని ఆరోపించారు. ఎంక్వైరీలో ఎంత మాత్రమూ నిష్పాక్షికత లేదని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి పవర్ థర్మల్ విద్యుత్ కేంద్రాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్.. కేసీఆర్ కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇవాళ్టిలోగా సమాధానం ఇవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలో కొద్ది సేపటి క్రితం మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. విచారణ అనేది ఓ పవిత్రమైన బాధ్యత అని, వివాదం తలెత్తినప్పుడు మధ్యవర్తిగా నిలిచి అసలు నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన విధి అని అన్నారు. అన్ని విషయాలను అన్ని కోణాలను పరిశీలించి, పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాతే డాక్యుమెంటరీ ఎవిడెన్సులతో బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాలి. కానీ మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత మీ వ్యాఖ్యలను గమనిస్తే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎట్లా నివేదిక ఇవ్వాలన్నట్టు మాట్లాడుతున్నారని గమనించానన్నారు.
ఇప్పటికే తప్పు జరిగిపోయిందన్నట్టు.. ఆ తప్పు వల్ల ఎంత ఆర్థిక నష్టాన్ని లెక్కించాల్సి ఉందన్నట్టే మీ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినప్పటికీ మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని అన్నారు. మీ విచారణలో నిష్పాక్షిత ఏమీ కనిపించడం లేదని, అందువల్ల మీ ముందు నేను హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నదని అన్నారు. పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మీరే స్వచ్ఛందంగా ఎంక్వైరీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు కేసీఆర్ పేర్కొన్నారు.
నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నం
విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంట్ ఏ మాత్రం సరిపోదని కేసీఆర్ తెలిపారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ పటిష్ఠానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నామన్నారు. అన్ని రకాల అనుమతులు పొంది ముందుకెళ్లామన్నారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదనే నిబంధన ఉందని, ఈ విషయం రేవంత్ ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిటీ ఏర్పాటు చేశారని విమర్శించారు.
రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ రంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పారు. కరెంటు సరిగా లేక లక్షలాదిగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోయే పరిస్థితి ఉండేదని వివరించారు. పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజుల హాలిడే ప్రకటించేవారని పేర్కొన్నారు. రాజకీయ కక్షతో నన్ను, అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేయడానికే కమిషన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. విలేకర్ల సమావేశంలో కమిషన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడిందని పేర్కొన్నారు.