నమస్తే అంటే కార్పొరేషన్‌ పదవి.. కాళ్ల మీద పడితే కేబినెట్‌‌ పదవి

నమస్తే అంటే కార్పొరేషన్‌ పదవి.. కాళ్ల మీద పడితే కేబినెట్‌‌ పదవి

హైదరాబాద్‌‌, వెలుగు: ‘‘నమస్తే అంటే కార్పొరేషన్‌‌.. కాళ్ల మీద పడితే కేబినెట్‌ హోదా. సీఎం కేసీఆర్‌కు నచ్చినోళ్లకే అన్నీ.. రాష్ట్రంలో పాలనంతా అయోమయంగా, అస్తవ్యస్తంగా మారిపోయింది” అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని, పథకాలేవీ సరిగా అమలు కావడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌‌ ఏడాది పాలనపై శుక్రవారం అసెంబ్లీలోని మీడియా హాల్‌‌లో భట్టి మాట్లాడారు. కేసీఆర్‌‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇచ్చే దిశగా ప్రయత్నం కూడా చేయలేదని, ఉద్యోగ ప్రకటనలు కూడా లేవన్నారు. రుణమాఫీ చేయలేదని, రైతు బంధు పైసలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. 57 ఏండ్లు దాటినోళ్లకు వృద్ధాప్య పింఛన్ ఇస్తామన్న విషయం మర్చేపోయారన్నారు. జనం ఆశలు నిరాశలయ్యాయి. తెలంగాణ వస్తే తమ జీవితాలు బాగుపడ్తాయని జనం నమ్మారని, కానీ ఏ ఒక్క వర్గానికి కూడా ప్రయోజనం లభించలేదని భట్టి విమర్శించారు. ‘‘ డబుల్‌‌ బెడ్రూం ఇండ్లు కట్టిస్తమన్నరు. సొంత జాగా ఉన్నోళ్లు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తమన్నరు. ఇండ్లు కడ్తలేరు, పైసలు ఇస్తలేరు ’’ అని భట్టి మండిపడ్డారు.