కేసీఆర్కు సమాధానం చెప్పబోం

కేసీఆర్కు సమాధానం చెప్పబోం

‘కేసీఆర్​ ఎవరో  కోన్ కిస్క.. ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం మా పార్టీకి లేదు’  అని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్​ వ్యాఖ్యానించారు.  రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది ? ఏం చేస్తోంది ? అనే   వివరాలను తెలంగాణ సమాజానికి స్వయంగా ప్రధాని మోడీ వివరించారని చెప్పారు.  బీజేపీపై ప్రేమాభిమానాలు చూపుతున్న - తెలంగాణ ప్రజలకు మోదీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారని గుర్తు చేశారు. విజయవాడకు వెళ్లేందుకు సోమవారం ఉదయం  రాజ్​ భవన్​ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న  ప్రధాని మోడీకి వీడ్కోలు పలికేందుకు వచ్చిన సందర్భంగా బండి సంజయ్​ మీడియాతో మాట్లాడారు. 

“కేసీఆర్​ తొలుత తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి.  ప్రజలకు మొహం చూపించే ధైర్యం సీఎంకు లేదు” అని కామెంట్​ చేశారు. మోడీని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకే.. హైదరాబాద్​ నగరమంతా ఫ్లెక్సీలను  కేసీఆర్​ పెట్టించుకున్నారని మండిపడ్డారు. ఈ ప్రచారం కోసం టీఆర్ఎస్​ ఖర్చు చేసిన డబ్బంతా ప్రజలదేనని ఆరోపించారు.  కేసీఆర్​పై ఉన్న ప్రజా వ్యతిరేకత నిన్నటి ‘విజయ సంకల్ప సభ’ తో మరోసారి బహిర్గతమైందన్నారు. ప్రధాని మోడీ సభకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.  జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నామని సంజయ్​ చెప్పారు.