
సూర్యాపేటలో పర్యటించిన సీఎం కేసీఆర్.. జిల్లాలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో ఈ విషయాన్ని చెప్పారు. సూర్యాపేట జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు ( కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల ) రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నామని చెప్పారు. సూర్యాపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ.50 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.
సూర్యాపేటలో కళాభారతి కావాలని మంత్రి జగదీశ్ రెడ్డి కోరారని.. రూ.25 కోట్లతో కళాభారతిని మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులకు దీటుగా కళాభారతిని నిర్మించాలని మంత్రి జగదీశ్ రెడ్డికి సూచించారు.
సూర్యాపేట పట్టణం మరింత అభివృద్ధి చెందాలని.. కొత్త రోడ్లు కావాలని మంత్రి జగదీశ్ రెడ్డిని కోరారు. మహిళా పాలిటెక్నిక్ కాలేజీ కూడా మంజూరు చేస్తామన్నారు. స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు కూడా వెంటనే జీవో రిలీజ్ చేస్తామని చెప్పారు. మంత్రి జగదీశ్ రెడ్డి అడిగినట్లు ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ కూడా మంజూరు చేయాలని ఆ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి సూచించారు.