రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోము

రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోము

తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లో లాక్‌డౌన్‌ విధించబోమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. గత అనుభవాలతో పాటు ఇతర  రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా కేసుల సంఖ్య తగ్గడం లేదన్నారు. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందులు పడతారని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ అధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షించారు. కరోనా చికిత్స, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై ప్రధానంగా సమీక్షించారు. రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్‌, వ్యాక్సిన్లు, రెమ్‌డెసివిర్‌ సరఫరాపై ప్రధాని మోడీతో కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. వాటిని తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాలని ప్రధానిని కోరారు.


తమిళనాడులోని పెరంబదూర్, కర్ణాటకలోని బళ్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్‌ అందడం లేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు కరోనా బాధితులు రావడంతో భారం పెరిగిందని ప్రధానికి సీఎం వివరించారు. రాష్ట్రానికి రోజుకు 440 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందుతోందని.. దానిని 500 మెట్రిక్‌ టన్నులకు పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు 4,900 మాత్రమే అందుతున్నాయని.. ఆ కోటాను 25 వేలకు పెంచాలని కోరారు. కేంద్రం ఇప్పటివరకు రాష్ట్రానికి 50 లక్షల డోసులను సరఫరా చేసిందన్నారు. రాష్ట్రంలో రోజుకు రెండు నుంచి 2.5 లక్షల డోసులు అవసరం ఉందని చెప్పారు. వాటిని సత్వరమే సరఫరా చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్.