కేసీఆర్ మేడిగడ్డకు పోవాలి

కేసీఆర్ మేడిగడ్డకు పోవాలి
  •      చేసిన పాపానికి ప్రజలకు క్షమాపణ చెప్పాలి: ఉత్తమ్ 
  •     కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్​ ప్లానర్, ఇంజినీర్ కేసీఆరే
  •     ఎంత కాంక్రీట్, ఏ సీసీ బ్లాకులు వాడాలో ఆయనే చెప్పిండు
  •     విజిలెన్స్ తుది నివేదిక ఆధారంగా కేసులు పెట్టి విచారిస్తమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: దేశంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అంత పెద్ద కుంభకోణం ఇంకోటి లేదని ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. ఇది తాను చెప్తున్న మాట కాదని.. కాగ్, విజిలెన్స్, నేషనల్​డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికల్లో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ‘‘కాళేశ్వరం పేరుతో కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను అన్​సైంటిఫిక్​గా కట్టారు. అందుకే మేడిగడ్డ కుంగింది” అని మండిపడ్డారు. బుధవారం జలసౌధలో మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. 

‘‘బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్ ‘చలో మేడిగడ్డ’కు పిలుపునిచ్చారు. మేం వాళ్లలాగా కాళేశ్వరం ప్రాజెక్టును నిషేధిత ప్రాంతంగా పెట్టలేదు. బీఆర్ఎస్​నేతల పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులు, ఇంజినీర్లను ఆదేశించాం. మేడిగడ్డ కుంగడానికి కారణమైన కేసీఆర్​కూడా అక్కడికి వెళ్లాలి. బ్యారేజీ పగుళ్లను చూసి, ఆ పాపానికి ప్రజలకు క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు. 

‘‘కాళేశ్వరం ప్రాజెక్టుకు చీఫ్​డిజైనర్, ప్లానర్, ఆర్కిటెక్ట్, ఇంజినీర్ ​అన్నీ కేసీఆరే. మేడిగడ్డ పాపం కేసీఆర్​దే. బ్యారేజీ నిర్మించే సమయంలో ఎంత కాంక్రీట్​వాడాలి? రోజుకు ఎన్ని క్యూబిక్​మీటర్ల కాంక్రీట్​పనులు చేయాలి? ఏ సైజ్​సీసీ బ్లాకులు వాడాలి? అనేది అప్పటి సీఎం కేసీఆరే స్వయంగా ఆదేశించినట్టు మినిట్స్​లో ఉందనే విషయం విజిలెన్స్​విచారణలో తేలింది. త్వరలోనే విజిలెన్స్​తుది నివేదిక వస్తుంది. దాని ఆధారంగా బాధ్యులందరిపై కేసులు నమోదు చేసి విచారణ చేపడుతాం” అని ఉత్తమ్​ తెలిపారు. 

డిప్రెషన్​లో కేటీఆర్.. 

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయొద్దని నేషనల్​ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందని ఉత్తమ్ తెలిపారు. కానీ కాఫర్ ​డ్యామ్ కట్టి నీళ్లు నిల్వ చేయొచ్చంటూ కేసీఆర్, కేటీఆర్​అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘కేసీఆర్​ చేసిన డిజైన్​తోనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది. ఇంకా వాళ్ల సలహాలు, సూచనలు తీసుకోవాలని అడగడం అర్థరహితం. తనకు పేరు రావాలని కేసీఆర్ కాళేశ్వరం కట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కేటీఆర్ ​డిప్రెషన్​లో ఏదేదో మాట్లాడుతున్నారు” అని ఫైర్ అయ్యారు.

 ‘‘అన్నారంలో నిల్వ ఉన్న నీటిని సుందిళ్లకు లిఫ్ట్​ చేయలేం. బ్యారేజీకి బుంగలు పడటంతో అది మేడిగడ్డలా మారకూడదనే గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేశాం. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు రిపేర్లు చేస్తాం” అని స్పష్టం చేశారు. ‘‘పదేండ్లలో కేసీఆర్​ప్రభుత్వం ఇరిగేషన్​పై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి, 15 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు మాత్రమే నీళ్లు ఇచ్చింది. మేడిగడ్డ నుంచి 163 టీఎంసీలు ఎత్తిపోస్తే, అందులో 51 టీఎంసీలను వృథాగా సముద్రంలోకి వదిలేశారు. స్టోరేజీ, ట్రాన్స్ మిషన్ లాసెస్ తీసేస్తే.. ఉపయోగించింది 65 టీఎంసీలు మాత్రమే” అని పేర్కొన్నారు. 

ఇంజినీర్లు వద్దన్నా కేసీఆర్ వినలే..  

ప్రాణహిత పైనే బ్యారేజీ కట్టాలని ఇంజినీర్ల కమిటీ నివేదిక ఇచ్చినా కేసీఆర్ వినలేదని ఉత్తమ్ మండిపడ్డారు. ‘‘మేడిగడ్డ నుంచి 160 టీఎంసీలు లిఫ్ట్ చేయడం భారీ వ్యయంతో కూడుకున్నదని ఇంజినీర్ల కమిటీ చెప్పింది. అయినా కేసీఆర్​ రీడిజైన్​పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్లకు పెంచారు. ఇప్పుడది రూ.1.47 లక్షల కోట్లకు పెరిగింది. విజిలెన్స్ నివేదిక తర్వాత అన్ని విషయాలు బయట పెడతాం” అని చెప్పారు. ఎల్ అండ్ టీ ఖర్చులతోనే మేడిగడ్డ మరమ్మతులు చేయాలని గతంలోనే ఆ సంస్థకు స్పష్టంగా చెప్పామని తెలిపారు. 

త్వరలోనే ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​ను రీఆర్గనైజేషన్​చేస్తామన్నారు. ‘‘ఎస్సారెస్పీ స్టేజీ –2 ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు ఇచ్చారనేది అబద్ధపు ప్రచారం. ఇప్పుడు కూడా స్టేజీ –2కు నీళ్లు అందుతున్నాయి. కాళేశ్వరం బ్యారేజీల్లో నీళ్లు లేనప్పుడు కూడా స్టేజీ –2కు నీళ్లు ఇచ్చి చూపిస్తున్నాం. దక్షిణ తెలంగాణ తాగునీటి అవసరాల కోసం త్వరలోనే నేను, సీఎం రేవంత్​రెడ్డి కర్నాటకకు వెళ్లి అక్కడి ప్రభుత్వాన్ని  నీళ్లు విడుదల చేయాలని కోరుతాం”అని ఉత్తమ్​ చెప్పారు.

చిన్న కాళేశ్వరం తొలి దశ త్వరగా పూర్తి చేయాలి

చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర్) లిఫ్ట్​తొలి దశ పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంజినీర్లను మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆదేశించారు. బుధవారం జలసౌధలో ప్రాజెక్టు పనులపై ఆయన ఇంజినీర్లతో సమీక్షించారు. తొలి దశలో ఈ ప్రాజెక్టు కింద 10 వేల ఎకరాలకు నీళ్లు అందేలా పనులను పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ టెక్నికల్​అడ్వైజరీ కమిటీ (టీఏసీ) పర్మిషన్​ఇచ్చినందునా ఏఐబీపీ – పీఎంకేఎస్ వైలో భాగంగా కేంద్ర సహాయం కోసం ప్రతిపాదనలు రెడీ చేయాలన్నారు. ప్రాజెక్టు ఇన్వెస్ట్​మెంట్​క్లియరెన్స్​కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు.

 రూ.500 కోట్లతో 4.5 టీఎంసీలను రెండు దశల్లో ఎత్తిపోసి 45 వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టామన్నారు. మొదటి దశలో ఆయకట్టుకు నీళ్లిచ్చే పనుల కోసం భూసేకరణ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో భూపాలపల్లి కలెక్టర్​భవేశ్​మిశ్రా, ఇరిగేషన్​ఈఎన్సీ (జనరల్) అనీల్​కుమార్, రామగుండం సీఈ సుధాకర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.