క్యాండిడేట్లకు కేసీఆర్ ఫోన్

క్యాండిడేట్లకు కేసీఆర్ ఫోన్

మున్సిపోల్స్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై డైరెక్షన్

హైదరాబాద్, వెలుగు: మున్సిపోల్స్​ ప్రచారానికి దూరంగా ఉన్న టీఆర్ఎస్​ చీఫ్, సీఎం కేసీఆర్ ప్రచారం ముగిశాక రంగంలోకి దిగారు. ప్రగతిభవన్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి పోల్ డైరెక్షన్ ఇస్తున్నట్లు సమాచారం. పోలింగ్‌కు ముందుతీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నట్లు తెలిసింది .టీఆర్​ఎస్​ వీక్‌గా ఉన్న సెంటర్లలో ఇతర పార్టీల పరిస్థితి ఏమిటి? ఎట్ల గట్టెక్కా లనే దానిపై సూచనలుచేస్తున్నట్లు సమాచారం. కొందరు క్యాండిడేట్లకు కూడా ఆయనే నేరుగా ఫోన్ చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నిజామాబాద్‌లోని పరిస్థితిపై స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు సీఎం కేసీఆర్​ ఫోన్​ చేసి ఆరా తీసినట్లు తెలిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో పరిస్థితిపై అక్కడి పార్టీ ఇన్​చార్జ్‌కు, బోధన్​లోని కొందరు క్యాండిడేట్లకు, ఆదిలాబాద్‌లోని కొందరు క్యాండిడేట్లకు సీఎం ఫోన్​ చేసి పలు సూచనలు చేసినట్లు సమాచారం. హైదరాబాద్ నగర శివారుల్లోని మున్సిపాలిటీల్లో పార్టీ పరిస్థితిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా ఆయన ఫోన్​ చేసి ఆరా తీసినట్లు తెలుస్తోంది.

బీజేపీ ఎంపీలున్న జిల్లాల పై స్పెషల్ ఫోకస్

బీజేపీ ఎంపీలు ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై టీఆర్​ఎస్​ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మూడు జిల్లాల్లో మెజార్టీ డివిజన్లు, వార్డులను గెలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ జిల్లాల్లో బీజేపీకి సీట్ల సంఖ్య పెరగకుండాఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో టీఆర్​ఎస్​ నేతలకు సీఎం సూచిస్తున్నట్లు తెలిసింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వ్యతిరేకత ఉన్నట్లు నిఘావర్గాలు ఇచ్చిన సమాచారంతో టీఆర్​ఎస్​ అలర్టయింది. వెంటనే మంత్రి ప్రశాంత్ రెడ్డిని నిజామాబాద్‌కు వెళ్లాలని సీఎం ఆదేశించడంతో ఆయన అక్కడికి వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. దావోస్​ పర్యటనలో ఉన్న టీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మున్సిపల్ ఎన్నికలపై అక్కడినుంచే ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఎన్నికల ఇంచార్జీలకు ఫోన్ చేసి పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు. హైదరాబాద్ శివారులోని కార్పొరేషన్,మున్సిపాలిటీల్లో పోలింగ్ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డికి సూచనలు చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.