వాకర్‌‌ సాయంతో నడిచిన కేసీఆర్  .. వీడియో రిలీజ్ చేసిన యశోద హాస్పిటల్ డాక్టర్లు

వాకర్‌‌ సాయంతో నడిచిన కేసీఆర్  .. వీడియో రిలీజ్ చేసిన యశోద హాస్పిటల్ డాక్టర్లు
  • ఎనిమిది వారాల విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని వెల్లడి
  • రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం
  • కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రముఖులు

హైదరాబాద్, వెలుగు:  హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకున్న బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ శనివారం వాకర్ సాయంతో డాక్టర్ల పర్యవేక్షణలో కాసేపు నడిచారు. హాస్పిటల్‌లోని తన రూమ్‌లో వాకర్‌‌తో కేసీఆర్ నడుస్తున్న 1.43 నిమిషాల నిడివి ఉన్న వీడియోను ఈ మేరకు రిలీజ్ చేశారు. గురువారం రాత్రి ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ జారిపడటంతో ఆయన్ను సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌కు కుటుంబ సభ్యులు తరలించారు. 

సీటీ స్కాన్​ చేసిన డాక్టర్లు.. తుంటి ఎముక విరిగినట్టుగా గుర్తించారు. శుక్రవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. రాత్రి హిప్ ​రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. శనివారం మధ్యాహ్నం డాక్టర్ ​ప్రవీణ్​రావు పర్యవేక్షణలో వాకర్ సాయంతో కేసీఆర్ నడిచారు. డాక్టర్లు వాకర్‌‌ను ముందుకు జరుపుతూ కేసీఆర్‌‌తో జాగ్రత్తగా అడుగులు వేయించారు. హిప్ ​రీప్లేస్‌మెంట్ సర్జరీ చేసిన వారి శారీరక, మానసిక సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ‘మొబిలైజేషన్ స్టార్ట్’ చేస్తారని, ఇందులో భాగంగానే కేసీఆర్‌‌ను నడిపించే ప్రయత్నం చేశామని డాక్టర్లు తెలిపారు.

హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగైందని ప్రవీణ్​రావు చెప్పారు. కేసీఆర్ మానసికంగా బలంగా ఉన్నారని, ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వేగంగా రికవర్ అవుతున్నారని తెలిపారు. బ్రీతింగ్ ఎక్సర్‌‌సైజ్‌లు చేయిస్తామని, ఆయన మెడికల్‌గా స్టేబుల్‌గా ఉన్నారని, నార్మల్​ఫుడ్​ తింటున్నారని చెప్పారు. మరికొన్ని రోజులు ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుందని, శరీరం ఇట్లాగే సహకరిస్తే రెండు, మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.

కేటీఆర్‌‌కు అఖిలేశ్ యాదవ్ ఫోన్

కేసీఆర్​ఆరోగ్య పరిస్థితిపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ​ఆరా తీశారు. శనివారం మంత్రి కేటీఆర్‌‌కు ఆయన ఫోన్​చేసి ‘కేసీఆర్ ఎలా ఉన్నారు?.. ప్రమాదం ఎలా జరిగింది? ఆపరేషన్​తర్వాత పరిస్థితి ఏమిటి?’’ అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎంఐఎం చీఫ్, హైదరాబాద్​ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం యశోద హాస్పిటల్​కు వెళ్లి కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్, ఎంపీ సంతోష్‌తో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు రామోజీ గ్రూప్​ సంస్థల చైర్మన్​ రామోజీ రావు శనివారం కేటీఆర్​కు లేఖ రాశారు. కేసీఆర్ గాయపడ్డారని తెలిసి బాధపడ్డానని, ఆయన కోలుకొని ప్రజాసేవకు రెట్టించిన ఉత్సాహంతో పునరంకితమవుతారని ఆకాంక్షించారు.

కేసీఆర్​కు చిన్నజీయర్​ పరామర్శ

హైదరాబాద్, వెలుగు: తుంటి ఎముక విరగడంతో సోమాజిగూడ యశోద హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ ​చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ను శనివారం రాత్రి చిన్నజీయర్​ స్వామి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. డాక్టర్లతో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దాదాపుగా రెండేళ్లుగా చిన్న జీయర్ కు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. తాజాగా కేసీఆర్ ​ఫామ్‌ హౌస్​లో కిందపడి హాస్పిటల్​లో చేరడంతో జీయర్ ​స్వయంగా హాస్పిటల్​కు వచ్చి  పరామర్శించారు.

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్​ ఆరా

కేసీఆర్​ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్​తమిళి సై ఆరా తీశారు. శనివారం ఉదయం రాజ్​భవన్​లో అసెంబ్లీ ప్రొటెం స్పీకర్​గా అక్బరుద్దీన్​ ఒవైసీ ప్రమాణ స్వీకారం జరగ్గా.. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్​ ప్రతినిధిగా హాజరైన మాజీ మంత్రి హరీశ్​రావుతో గవర్నర్​ మాట్లాడారు. ఆపరేషన్ ​తర్వాత ఎలా ఉన్నారనే వివరాలు అడిగారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.