గెట్‌ రెడీ.. మూడొంతుల ఓట్లు మనకే రావాలె

గెట్‌ రెడీ.. మూడొంతుల ఓట్లు మనకే రావాలె

లోక్ సభ ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం కేసీఆర్‌ మంత్రులను ఆదేశించారు. ప్రతి బూత్ లో పోలయ్యే ఓట్లలో 75 శాతం టీఆర్‌ఎస్ కే వచ్చేలా కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్దేశించినట్టు సమాచారం. ఒక్కో ఎంపీ స్థానంలో కనీసం 3 లక్షల నుంచి 4 లక్షల మెజార్టీ సాధించేందుకు కృషి చేయాలని చెప్పినట్టుగా తెలిసింది . లోక్ సభ ఎన్నికల షెడ్యూల్‌ రానున్న నేపథ్యంలో ఎక్కువ సమయం ప్రజాక్షేత్రంలోనే ఉండాలని చెప్పారు. శుక్రవారమే షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉందని, ఆ వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని మంత్రులకు సూచించారు. అధికారిక విధులు చూసుకుంటూనే బాధ్యతలు ఇచ్చిన ఎంపీ స్థానాలను సమన్వయం చేసుకోవాలని చెప్పారు. 13 పార్లమెంట్‌ నియోజకవర్గాల బాధ్యతలు చూస్తున్న పది మంది మంత్రులకు ఓ కీలక నేత ద్వారా ఈ మేరకు సమాచారం పంపినట్టు తెలిసింది. పార్లమెంట్‌ సన్నాహక సమావేశాల్లోనూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్కువగా మెజార్టీపైనే ఫోకస్‌ చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి ఎవరైనా ఓటు వేసేది కేసీఆర్‌కేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని నాయకులకు చెబుతున్నారు. విభేదాలను పక్కనపెట్టి అంతా కలిసి పనిచేయాలని స్పష్టం చేస్తున్నారు.

బూత్ ల వారీగా టార్గెట్లు
పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలతో సమావేశాలు ఏర్పాటు చేసి బూత్ ల వారీగా టార్గెట్లు విధించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు 47 శాతం ఓట్ పోలయ్యాయని, పార్లమెంట్‌ ఎన్నికల్లో కనీసం పదిశాతం ఓట్లను పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులకు సూచించారు. సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్న మెదక్‌, జహీరాబాద్‌, ఖమ్మం స్థానాల్లోనూ అంతేస్థా యిలో ఓట్లు పోలయ్యేందుకు త్వరలోనే కొందరికి బాధ్యతలు అప్పగించనున్నారు. మొత్తం 16 సీట్లలో ఇదే ఫార్ములా అనుసరించాలన్నారు.

ఆ మూడింటిపై స్పె షల్‌‌ ఫోకస్‌
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వెనుకబడిన ఖమ్మం, మహబూబాబాద్‌ ఎంపీ స్థా నాలతోపాటు కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకున్న నల్లగొండపై టీఆర్‌ ఎస్‌ స్పెషల్‌‌ ఫోకస్‌ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సీట్లను పార్టీ ఖాతాలో వేసుకోవడమే కాదు.. ఒక్కోచోట 3 లక్షల మెజార్టీ రావాలని సీఎం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటేసిన వాళ్లనూ టీఆర్‌ ఎస్‌ వైపు మళ్లేలా చూడాలన్నారు. పెరిగిన పింఛన్లు వచ్చేనెలలో లబ్ధిదారుల చేతికి అందు తాయి. రైతుబంధు ఖరీఫ్‌ సాయాన్నీ మేలోనే రైతుల ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది . ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ టీఆర్‌ ఎస్‌ కే ఓటేసేలా బూత్‌‌ స్థాయిలో కార్యకర్తలను అప్రమత్తం చేయాలని సీఎం తెలిపారు.

ఈ నెల మూడోవారం నుంచే..
ఈ నెల మూడో వారం నుంచి ఓటర్లను కలిసేందుకు కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ సన్నద్ధత, ప్రచారం, ఇతర అంశాలను రోజువారీగా పార్టీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పర్యవేక్షిస్తారు. ఇన్‌‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యే లతో రోజూ మాట్లాడుతూ టార్గెట్ల మేరకు పనిచేస్తున్నారా లేదా అన్నది తెలుసుకుంటారు. అభ్యర్థులను ప్రకటించిన అనంతరం మరోమారు అన్ని నియోజకవర్గాల్లో కేటీఆర్‌ నేతృత్వంలో సమావేశాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తుదిదశలో పోలింగ్‌‌కు ముందు సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.