ఉక్రెయిన్ పై 620 డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడ్డ రష్యా.. ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు

ఉక్రెయిన్ పై 620 డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడ్డ రష్యా.. ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇరుదేశాలు డ్రోన్లు, మిస్సైళ్లతో భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ముఖ్య నగరాలు, డిఫెన్స్ స్థావరాలే లక్ష్యంగా టార్గెట్ చేసుకుంటున్నాయి. శనివారం (జులై 12) (రష్యా కాలమానం ప్రకారం శుక్రవారం) ఈ రెండు దేశాలు ఒకదానిపై మరొకటి దాడులు చేసుకున్నాయి. 

ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకు పడింది. 597 డ్రోన్లు, 26 క్రూయిజ్ మిస్సైల్స్ తో రష్యా దాడి చేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు చనిపోగా మరో 14 మంది గాయపడ్డారు. బుకోనివా ప్రాంతంపై నాలుగు డ్రోన్లు, ఒక మిస్సైల్ ప్రయోగించింది. పశ్చిమ ఎల్వివ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడుల్లో ఆరుగురు, ఈశాన్య ఖార్కివ్ ప్రాంతంలో ఎనిమిది డ్రోన్లు, రెండు మిస్సైళ్ల దాడిలో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. రష్యా ప్రయోగించిన డ్రోన్లలో 319 డ్రోన్లను ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థ అడ్డుకోగా, మరో 258 డ్రోన్లను నిర్వీర్యం చేశారు.

ALSO READ | 7 సంవత్సరాల ముందే అమెరికా హెచ్చరిక.. ఎయిర్ ఇండియా విని ఉంటే 260 మంది బతికేవారు..!

దాడికి ప్రతిగా రష్యా ను టార్గెట్ చేసింది ఉక్రెయిన్. రష్యాలోని వైమానిక స్థావరంపై దాడి చేయడంతో ఇద్దరు చనిపోయినట్లు రష్యా అధికారులు తెలిపారు. రష్యా క్యాపిటల్ సిటీ మాస్కోను టార్గెట్ చేసిన ఉక్రెయిన్.. వైమానిక, డిఫెన్స్ స్థావరాలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగింది. రష్యాలోని తుల ప్రాంతంలో వైమానిక స్థావరంతో పాటు మిస్సైళ్లను తయారు చేసే తులా ప్రాంతంపై ఉక్రెయిన్ దాడి చేసినట్లు ప్రకటించారు.