ఆ 4 మండలాలకు త్వరలో దళిత బంధు పైసలు

ఆ 4 మండలాలకు త్వరలో దళిత బంధు పైసలు
  •     రాష్ట్రం నలుదిక్కుల్లో పైలెట్ ప్రాజెక్టును అమలు చేస్తం  
  •     ఆర్థిక, సామాజిక వివక్షను పోగొట్టేందుకే స్కీం తెచ్చినం 
  •     దళితబంధుపై సమీక్షలో సీఎం కేసీఆర్‌ 

దళితులు తరతరాలుగా ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక వివక్షను పోగొట్టేందుకే దళితబంధు స్కీంను తెచ్చామని సీఎం కేసీఆర్‌‌‌‌ అన్నారు. దళితుల మనోభావాలు, వారి స్థితిగతులు, ఆర్థిక అవసరాలను పరిశీలించి రాష్ట్రం నలుదిక్కుల్లో పైలెట్‌‌‌‌ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని చెప్పారు. దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసి వ్యాపారవర్గంగా నిలబెడతామన్నారు. హుజూరాబాద్‌‌‌‌, వాసాలమర్రి సహా మధిర నియోజకవర్గంలోని చింతకాని, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ, జుక్కల్‌‌‌‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌‌‌‌ మండలాల్లో ఈ పథకాన్ని పైలెట్‌‌‌‌ ప్రాజెక్టుగా చేపడుతున్నామని తెలిపారు. దళితబంధు అమలుపై సంబంధిత ఉమ్మడి జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులతో సీఎం కేసీఆర్‌‌‌‌ సోమవారం ప్రగతి భవన్‌‌‌‌లో సమీక్ష నిర్వహించారు. హుజూరాబాద్‌‌‌‌, వాసాలమర్రికి ఇప్పటికే నిధులు విడుదల చేశామని, మిగతా నాలుగు మండలాలకు రెండు మూడు వారాల్లో దశల వారీగా నిధులు ఇస్తామన్నారు.
 
లైసెన్స్ లలో రిజర్వేషన్.. 

ప్రభుత్వం ఇచ్చే లైసెన్సుల్లోనూ దళితులకు రిజర్వేషన్‌‌‌‌ కల్పిస్తామని సీఎం చెప్పారు. మెడికల్‌‌‌‌ షాపులు, ఫర్టిలైజర్‌‌‌‌లు, మీసేవ కేంద్రాలు, గ్యాస్‌‌‌‌ డీలర్‌‌‌‌షిప్‌‌‌‌లు, ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ పర్మిట్‌‌‌‌లు, మైనింగ్‌‌‌‌ లీజులు, సివిల్‌‌‌‌, ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ కాంట్రాక్టులు, బార్లు, వైన్‌‌‌‌షాపులు, ఇతర రంగాల ద్వారా దళితులు ఉపాధి పొందేలా చర్యలు చేపడుతామన్నారు. కలెక్టర్లు, దళితబంధు కమిటీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కమిటీలు ఉంటాయని, వీటినుంచే రీసోర్స్‌‌‌‌ పర్సన్లను ఎంపిక చేస్తామన్నారు. 

అన్నివర్గాలనూ ఆదుకుంటం.. 

ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని విస్మరించలేదని సీఎం అన్నారు. బ్రాహ్మణులు, ఇతర అగ్రకులాల్లోని పేదలను గుర్తించి వారి అభివృద్ధికి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. దళితబంధు కింద ఇచ్చే సాయం బ్యాంక్‌‌‌‌ లోన్‌‌‌‌ కాదని, తిరిగి చెల్లించాల్సిన పని లేదన్నారు. దీనితో ఫలానా పని చేయాలన్న ఒత్తిడి లేదని, వచ్చిన.. నచ్చిన పని చేసుకోవచ్చనే దానిపై అవగాహన కల్పించాలన్నారు. దళితుల అభ్యున్నతి కోసం అధికారులు పేరంటల్‌‌‌‌ అప్రోచ్‌‌‌‌తో పని చేయాలని చెప్పారు.