కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలి : విజయశాంతి

కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలి :  విజయశాంతి

యాదగిరిగుట్ట, వెలుగు : సీఎం కేసీఆర్  పాలనకు చరమగీతం పాడాలని కాంగ్రెస్  పార్టీ  స్టార్  క్యాంపెయినర్  విజయశాంతి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆలేరు కాంగ్రెస్ క్యాండిడేట్ బీర్ల అయిలయ్యకు మద్దతుగా యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ లో గురువారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో విజయ శాంతి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను కేసీఆర్  దగా చేశారని, ప్రజల సంపదను ఇష్టానుసారంగా దోచుకున్నారని ఫైర్  అయ్యారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించి మిగులు బడ్జెట్ తో కాంగ్రెస్  పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. కేసీఆర్  తన అసమర్థతతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్  లక్షల కోట్లు వెనకేసుకుని రాష్ట్రాన్ని ఆగం పట్టించాడు.

తక్కువ సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని జబ్బలు చరుచుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు.. మేడిగడ్డ కుంగితే ఎందుకు మాట్లాడడం లేదు. మేడిగడ్డ కుంగినట్లే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్  పాతాళానికి కుంగిపోవడం ఖాయం” అని విజయశాంతి పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్  అభ్యర్థి బీర్ల అయిలయ్యను గెలిపించాలని ఓటర్లను ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బీర్ల అయిలయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, రాష్ట్ర నాయకుడు కుసుమ కుమార్, జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, బ్లాక్  కాంగ్రెస్  అధ్యక్షుడు గుడిపాటి మధుసూదన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిరిశెట్టి నర్సింహులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.