ఐటీ శాఖ చేతుల్లో ధరణిని పెట్టి..సర్కార్​ భూములు హాంఫట్​

ఐటీ శాఖ చేతుల్లో ధరణిని పెట్టి..సర్కార్​ భూములు హాంఫట్​
  • బయటకు వస్తున్న గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ పెద్దల లీలలు
  • రెవెన్యూ డిపార్ట్​మెంట్​ చూడాల్సిన  పనులన్నీ టీఎస్​టీఎస్​కే అప్పగింత
  • టీఎస్​టీఎస్​ స్పెషల్​ కమిషనర్​కే  ధరణి పోర్టల్​ బాధ్యతలు
  • పోర్టల్​లో ఏ భూమిని మార్చాలన్నా ఐటీ శాఖలోనే ‘కీ’
  • ఇదే అదునుగా వేల ఎకరాల ప్రభుత్వ, వివాదాస్పద ల్యాండ్స్​ కబ్జా 
  • పోర్టల్​లో జరిపిన తతంగం అంతా సీక్రెట్​
  • రంగారెడ్డి, మేడ్చల్​, సంగారెడ్డి, వికారాబాద్​లో భారీగా అక్రమాలు
  • గుర్తించిన కొత్త ప్రభుత్వం 

హైదరాబాద్, వెలుగు : రెవెన్యూ డిపార్ట్​మెంట్​ పరిధిలో ఉండాల్సిన ధరణి పోర్టల్​ను గత బీఆర్​ఎస్​ సర్కార్​ మూడేండ్లకుపైగా ఐటీ డిపార్ట్​మెంట్​ కనుసన్నల్లోనే  కొనసాగించింది. ప్రభుత్వ భూములు,  వివాదాస్పద ల్యాండ్స్, దేవాదాయ భూములు.. ఇట్లా దేనిలో మార్పులు చేర్పులు చేయాలన్నా అంతా ఐటీ డిపార్ట్​మెంట్​ చెప్పుచేతల్లోనే ఉండేది. ఆ డిపార్ట్​మెంట్​ చేసిందే శాసనం.. ఆడిందే ఆటగా సాగేది. అసలు గ్రామ స్థాయిలో భూముల సమస్యలు ఏమున్నాయి?  ఎలా పరిష్కరించాలి? ధరణిలో ఏం జరుగుతుందనే విషయం కనీసం కొందరు కలెక్టర్లకు కూడా తెలిసేది కాదు. ఫలితంగా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు కొత్త ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్​ మల్కాజ్ గిరి, సంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లోని వేల ఎకరాల ప్రభుత్వ భూములను గత సర్కార్​లోని కొంతమంది పెద్దలు తమ అనుచరుల పేర్ల మీదికి ట్రాన్స్​ఫర్​ చేసుకున్నట్లు కొత్త గవర్నమెంట్​ ప్రాథమికంగా గుర్తించింది. కాళేశ్వరం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్​ సంస్థల పరిస్థితి లెక్కనే ధరణి బాగోతాన్ని కూడా  త్వరలోనే బయటపెట్టేందుకు రెడీ అవుతున్నది. ధరణి దందాలో ఉన్నవాళ్లెవరు? బాధితుల పరిస్థితి ఏమిటి? ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములు పట్టా భూములుగా మారాయి? వాటి విలువ ఎంత? అనేది వెల్లడించనుంది. అసలు రెవెన్యూ డిపార్ట్​మెంట్​కు సంబంధం లేకుండా, క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారుల నివేదికలేమీ లేకుండా ధరణి పోర్టల్​ మొత్తం ఐటీ డిపార్ట్​మెంట్​ పరిధిలో నడిపించడం వెనుక ఉన్న మతలబేందనే దానిపై కొన్నిరోజులుగా పూర్తి వివరాలను ప్రస్తుత ప్రభుత్వం సేకరిస్తున్నది. 

జీవో బయటకు రాకుండా..!

ధరణిని తీసుకొచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు బాధ్యతలన్నింటినీ ఐటీ డిపార్ట్​మెంట్​ పరిధిలోని  ఈ–గవర్నెన్స్, తెలంగాణ స్టేట్​ టెక్నాలజికల్​ సర్వీసెస్​(టీఎస్​టీఎస్​)  స్పెషల్​ కమిషనర్ జి.టి.వెంకటేశ్వర్​రావు​కు అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం అప్పగించింది. ధరణి ప్రాజెక్టు డైరెక్టర్​గా ఆయనకు బాధ్యతలు ఇచ్చింది. 

ఈ మేరకు 2020  సెప్టెంబర్​ 18న అప్పటి సీఎస్​, సీసీఎల్​ఏ జీవో ఇచ్చారు. అయితే ఈ జీవో విషయం బయటకు రానియ్యలేదు. అప్పటికే వీఆర్వోల వ్యవస్థను తొలగించడంతో.. ఎమ్మార్వోలు, ఆర్డీవోలకు ధరణిలో ఎలాంటి అధికారాలు ఇవ్వలేదు. దీంతో ధరణి వ్యవస్థ పూర్తిగా ఐటీ శాఖ కనుసన్నల్లోకి వెళ్లింది. ధరణిలో ఏం జరుగుతుందనే విషయం కూడా అప్పుడు కలెక్టర్లకు, క్షేత్రస్థాయిలో భూముల అమ్మకాలు, కొనుగోళ్ల బాధ్యతలు చూసే ఎమ్మార్వోలకు కూడా అర్థమయ్యేది కాదు. ధరణి ప్రాజెక్టు డైరెక్టర్​గా ఉన్న టీఎస్​టీఎస్​ స్పెషల్ కమిషనర్​జి.టి. వెంకటేశ్వర్​రావును ముఖ్యమంత్రిగా రేవంత్​ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే బదిలీ చేశారు.  

టెక్నికల్​ సేవలకు పరిమితం చేయాల్సింది పోయి..!

సాధారణంగా ఏదైనా డిపార్ట్​మెంట్​లో కొత్త సాఫ్ట్​వేర్​, యాప్​ను అందుబాటులోకి తెస్తే.. అందులో టెక్నికల్​ వ్యవహారాలు, సైట్​ ప్రాబ్లమ్స్​, కొత్త అప్​డేట్స్​ వంటి సమయాల్లో మాత్రమే ఐటీ డిపార్ట్​మెంట్​ సహకారం తీసుకుంటారు. కానీ ధరణి పోర్టల్​ విషయంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా జరిగింది. అంతకుముందున్న ఇంటిగ్రేటెడ్​ ల్యాండ్​ రికార్డ్స్​ మేనేజ్​మెంట్​ సిస్టం (ఐఎల్ఆర్​ఎంఎస్​) కు సంబంధించి ఐటీ శాఖ పరిధిలోని టీఎస్ టీఎస్​ కేవలం వెండర్  పేమెంట్, కాంట్రాక్ట్​ మేనేజ్​మెంట్​, నెట్​వర్కింగ్​, బ్యాండ్​విడ్త్​, ఎక్స్​టర్నల్​ అప్లికేషన్​ ఇంటర్​ఫేజ్​ వంటి టెక్నికల్​ ఇష్యూస్​లు చూసింది. వీటికి సంబంధించి కూడా రోజువారీగా సీఎమ్మార్వోతో సంప్రదించి సీసీఎల్​ఏలో రిపోర్ట్​ చేసేవారు. అయితే ఐఎల్​ఆర్​ఎంస్​ సైట్​ ఎప్పుడైతే ధరణిగా మారిందో అప్పటి నుంచే దాన్ని పూర్తిగా ఐటీ డిపార్ట్​మెంట్​ పరిధిలోని టీఎస్​టీఎస్​కు అప్పగించేశారు. రికార్డులు మొదలు ధరణిలో మార్పులు, చేర్పులు అన్ని టీఎస్​టీఎస్​ పరిధిలోనే సాగేవి. 

రిపోర్టులన్నీ  ప్రాజెక్టు డైరెక్టర్​కే..!

టీఎస్​టీఎస్​ బాధ్యతల్లో ఉన్నవాళ్లకు ధరణి ప్రాజెక్ట్​ డైరెక్టర్​గా బాధ్యతలను గత బీఆర్​ఎస్​ సర్కార్​ అప్పగించడం వెనుక పెద్ద తతంగమే నడిచినట్లు కొత్త ప్రభుత్వానికి రిపోర్టులు అందాయి. సీసీఎల్​ఏలోని ఐఏఎస్​లకు అందించాల్సిన ధరణి రిపోర్టులను నేరుగా ఆ ప్రాజెక్ట్​ డైరెక్టర్​కే హెచ్​వోడీలు అందించేలా అప్పటి సర్కార్​ జీవో తెచ్చింది. ఇదంతా ఒక కుట్ర​ ప్రకారం జరిగినట్లు కొత్త ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ధరణి ప్రాజెక్ట్​ డైరెక్టర్ టీఎస్​టీఎస్​ నుంచే ఉండటం.. ధరణి సర్వర్​, సాఫ్ట్​వేర్​కు సంబంధించినవన్నీ టీఎస్ టీఎస్​ చూడటంతో గత ప్రభుత్వంలో కొందరు ఈజీగా డిజిటల్​ రికార్డుల్లో తమకు అనుకూలంగా మార్పులు చేసుకున్నట్లు తేలింది. ఇట్లా రంగారెడ్డి, మేడ్చల్​ మల్కాజ్ గిరి, సంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లోని  వందలాది ఎకరాల గవర్నమెంట్, అటవీ, దేవాదాయ, వక్ఫ్​ భూములతోపాటు అసైన్డ్​, వివాదాస్పద ల్యాండ్స్​ను కూడా కాజేశారని కొత్త ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ధరణిలో జిల్లా కలెక్టర్లు రిజెక్ట్​ చేసిన కొన్ని అప్లికేషన్లలోని భూములను  కూడా టీఎస్​టీఎస్​ ద్వారా సెట్​ చేయించుకున్నారని నిర్ధారణకు వచ్చింది.