
కమర్షియల్ సినిమా అయినా.. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ అయినా.. కీర్తి సురేష్ యాక్ట్ చేస్తే ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. మలయాళ చిత్రం ‘వాశి’ సినిమా పైన కూడా ఉన్నాయి. అయితే ఈ మూవీపై అంచనాలు ఏర్పడటానికి కీర్తి మాత్రమే కారణం కాదు. ఆమెకి జోడీగా టోవినో థామస్ యాక్ట్ చేయడం కూడా హైప్ తెచ్చింది. వెరైటీ కాన్సెప్ట్స్‌తో, సూపర్బ్ పర్‌ఫార్మెన్స్‌తో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు టోవినో. అందుకే అతనితో కలిసి కీర్తి నటించడం, పైగా ఆమె తండ్రి సురేష్ కుమారే ఈ చిత్రాన్ని నిర్మించడం వంటివి ఈ చిత్రానికి ప్లస్ అయ్యాయి. మలయాళంలోనే రూపొందించినా.. ఇతర భాషల్లోనూ ఈ చిత్రం విడుదలవుతోంది. దాంతో నిన్న మూవీ ఫస్ట్ లుక్‌ని మలయాళంలో మోహన్‌లాల్, మంజు వారియర్.. తెలుగులో మహేష్‌బాబు, సమంత.. తమిళంలో ఏఆర్ రెహమాన్, త్రిష.. హిందీలో అభిషేక్ బచ్చన్ లాంచ్ చేశారు. ఆఫీస్ రూమ్.. చుట్టూ ఫైళ్లు.. వాటి మధ్య కుర్చీ వేసుకుని కూర్చుంది కీర్తి. ఆమె పక్కనే నిలబడి ఉన్నాడు టోవినో. ఇద్దరూ లాయర్ గెటప్స్‌లో ఉన్నారు. చాలా సీరియస్‌గా చూస్తున్నారు. ఇద్దరూ కలిసి న్యాయం కోసం పోరాడతారా లేక ప్రత్యర్థులుగా పోటీ పడతారా అనే క్యూరియాసిటీ కలుగుతోంది. విష్ణు జి రాఘవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ పూర్తయ్యింది. త్వరలోనే రిలీజ్ డేట్‌ని ప్రకటించనున్నారు. ఇక కీర్తి హీరోయిన్‌గా నటించిన ‘సర్కారువారి పాట’ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సెల్వ రాఘవన్‌తో కలిసి నటించిన ‘సాని కాయిదమ్’ కూడా రిలీజ్‌కి రెడీగా ఉంది. చిరంజీవి ‘భోళాశంకర్’లో నటిస్తోంది. రీసెంట్‌గా నానితో కలిసి ‘దసరా’ మూవీ సెట్‌లోనూ జాయినయ్యింది.