కేరళ గవర్నర్ కు షాక్​.. ఇకపై వర్సిటీల ఛాన్స్లర్గా విద్యావేత్త

కేరళ గవర్నర్ కు షాక్​.. ఇకపై వర్సిటీల ఛాన్స్లర్గా  విద్యావేత్త

యూనివర్సిటీ చట్టాల సవరణ బిల్లుకు కేరళ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.  దీంతో యూనివర్సిటీలకు ఛాన్స్లర్ గా గవర్నర్ ఉండే పద్దతికి స్వస్తి పలికారు.  ఈ బిల్లు ఆమోదంతో ఇకపై విద్యావేత్తను యూనివర్సిటీలకు ఛాన్స్లర్ గా నియమించనున్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, స్పీకర్ తో కూడిన త్రిసభ్య కమిటీ సూచించిన వ్యక్తి ఇకపై కేరళ యూనివర్సిటీలకు ఛాన్స్లర్ గా వ్యవహరిస్తారు. 

అయితే.. విద్యావేత్తను ఛాన్స్లర్ గా నిమించడాన్ని కేరళ ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సుప్రీం కోర్టు జడ్జి, లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జిని నియమించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.. సభ్యుల ఆందోళనల మధ్యే యూనివర్సిటీ చట్టాల సవరణ బిల్లు–2022కు సభ ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ఆమోదంతో ఛాన్స్లర్లు 5 సంవత్సరాలు పనిచేయనున్నారు. కాగా, కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ ఖాన్‌, సీఎం విజ‌య‌న్ ప్ర‌భుత్వం మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రుగుతున్న నేప‌థ్యంలోనే ఈ బిల్లును అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు.

కేరళ సర్కారు వర్సెస్​ గవర్నర్​ ఆరిఫ్​ ఖాన్​

  • కేరళలోని ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్సిటీకి వీసీ నియామకాన్ని రద్దు చేస్తూ 2022 అక్టోబరు 21న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. 
  • కేరళ యూనివర్సిటీస్​ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ యూనివర్సిటీస్ వీసీగా డా. రిజీ జాన్ ని 2021 జనవరి 23న కేరళ సర్కారు నియమించింది. అయితే ఈ నియామకం కూడా చెల్లదంటూ 2022 నవంబరు 14న కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మారదర్శక సూత్రాల ప్రకారం.. కొత్త వీసీని ఛాన్స్​లర్​ హోదాలో ఉన్న గవర్నర్ నియమించాలని  నిర్దేశించింది.  
  • ఈ వరుస పరిణామాల నేపథ్యంలో కేరళలోని 9 వర్సిటీల వీసీలు రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ అక్టోబరు 23న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వాటిని విజయన్ ప్రభుత్వం ఖండించింది.
  • గవర్నర్​ ఆరిఫ్​ ఖాన్​ ఆదేశాలపై అక్టోబరు 24న 9 వర్సిటీల వీసీలు కోర్టు తలుపు తట్టారు.
  • ఆరిఫ్ ఖాన్ ను ఛాన్స్​ లర్ పదవి నుంచి తొలగించడానికి ఆర్డినెన్స్ ను తెచ్చేందుకూ ఒకానొక దశలో కేరళ ప్రభుత్వం సిద్ధపడింది.
  • ఈనేపథ్యంలోనే వర్సిటీల వీసీల నియామకాల్లో ఛాన్స్లర్ హోదాలో  గవర్నర్​ జోక్యాన్ని నివారించే ఉద్దేశంతోనే కేరళ సర్కారు యూనివర్సిటీ చట్టాల సవరణ బిల్లును ఆమోదించింది.