
తిరువనంతపురం: పన్నెండేండ్ల పోరడు యూట్యూబ్లో వైన్ తయారు చేసే వీడియో ఒకటి చూసిండు. ఇంట్లో అమ్మానాన్న కొనుక్కొచ్చి పెట్టిన ద్రాక్ష పండ్లు ఉండటంతో తానూ ప్రయోగం చేసిండు. యూట్యూబ్ వీడియోలో చూపించినట్లుగా వైన్ తయారు చేసి, శుక్రవారం స్కూలుకు తీసుకెళ్లి తన క్లాస్ మేట్ కు తాగించాడు. దీంతో ఆ పిల్లాడు వాంతులు చేసుకుని, ఊపిరి ఆడని పరిస్థితికి చేరుకోవడంతో ఆస్పత్రిలో చేర్పించారు.
ప్రస్తుతం ఆ పిల్లాడి కండిషన్ బాగానే ఉందని, డిశ్చార్జ్ అయ్యాడని పోలీసులు వెల్లడించారు.అక్రమంగా వైన్ తయారు చేసినందుకు కేసు నమోదు చేశామని తెలిపారు. యూట్యూబ్ వీడియోను చూసి కేవలం ద్రాక్ష పండ్లతోనే వైన్ ను తయారు చేశానని, వీడియోలో చూపించినట్లు వైన్ ను సీసాలో నింపి నేలలో కూడా పాతిపెట్టానని ఆ పిల్లాడు విచారణలో చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. వైన్ శాంపిల్ ను టెస్టుల కోసం ల్యాబ్ కు పంపామని, అందులో స్పిరిట్, ఆల్కహాల్, ఇతర కెమికల్స్ ఏవైనా కలిపినట్లు తేలితే ఆ పిల్లాడిపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామన్నారు.