ఇది కదా రియల్ కేరళ స్టోరీ : ముస్లిం వ్యక్తిని కాపాడటానికి రూ.34 కోట్లు ఇచ్చిన జనం

ఇది కదా రియల్ కేరళ స్టోరీ : ముస్లిం వ్యక్తిని కాపాడటానికి రూ.34 కోట్లు ఇచ్చిన జనం

కేరళ రాష్ట్రం.. కోజికోడ్.. అబ్దుల్ రహీం అనే వ్యక్తి సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఓ షేక్ ఇంట్లో.. అతని కొడుకును చూసుకోవటానికి ఉద్యోగంలో చేరాడు. ఆ అబ్బాయి వయస్సు 15 ఏళ్లు. పాక్షికంగా పక్షవాతం. ఆ అబ్బాయిని దగ్గరుండి చూసుకోవటం, పడవలో తిప్పటం వంటి చేయాలి. ఉద్యోగంలో చేరిన నెల రోజులకే.. అబ్దుల్ రహీం వల్ల.. పొరపాటున షేక్ కుమారుడు చనిపోయాడు. పోలీసులు అరెస్ట్ చేశారు.. అప్పటి నుంచి జైలులో ఉన్నాడు. విచారణ తర్వాత అబ్దుల్ రహీంకు మరణ శిక్ష విధించింది కోర్టు. కేరళ రాష్ట్రం సౌదీ వ్యవహారాల శాఖతోపాటు భారత ఎంబసీ ఈ విషయంలో న్యాయ సాయం అందించింది. అయినా ఫలితం లేదు.. దీంతో 18 సంవత్సరాలుగా సౌదీ జైలులో ఉంటున్నాడు అబ్దుల్ రహీం.. 

అబ్దుల్ రహీం సౌదీ వెళ్లినప్పుడు అతని వయస్సు 26 ఏళ్లు.. ఇప్పుడు 44 సంవత్సరాలు. మరణ శిక్షకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే సౌదీ చట్టాల ప్రకారం.. షేక్ కుటుంబంతో చర్చలు జరిపారు. నష్టపరిహారంతో అబ్దుల్ రహీంను విడుదల చేయటానికి ఎట్టకేలకు వారు ఒప్పుకున్నారు. దీని కోసం వారు 34 కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అది కూడా 2024, ఏప్రిల్ 15వ తేదీలోపు.. ఈ 34 కోట్ల రూపాయలను ఏప్రిల్ 15వ తేదీలోపుసౌదీ కోర్టులో జమ చేయాలని లేకపోతే మరణ శిక్ష అమలు చేస్తామని అక్కడి కోర్టు స్పష్టం చేసింది.

ఈ విషయం తెలిసిన అబ్దుల్ రహీం కుటుంబం.. 34 కోట్ల రూపాయల కోసం దాతలను కోరింది. దీనిపై స్పందించిన మలప్పురానికి చెందిన ఓ ఐటీ కంపెనీ ముందుకు వచ్చింది. ఫండ్ రైజింగ్ కోసం కె.కె.అలికుట్టి ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటైంది. ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించింది. సోషల్ మీడియా ద్వారా ఫండ్ రౌజింగ్ చేపట్టింది. వాట్సాప్స్ గ్రూప్ క్రియేట్ చేసింది ప్రచారం చేసింది. గల్ఫ్ దేశాలతోపాటు ఇతర దేశాల్లో ఉన్న కేరళీయులను కాంటాక్ట్ అయ్యింది. మార్చి నెలలో కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఏప్రిల్ నెల నుంచి.. టైం ముగుస్తున్న సమయం దగ్గర పడినప్పటి నుంచి రోజుకు 5 నుంచి 6 కోట్ల రూపాయలు వచ్చాయి. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అతి సామాన్యులు సైతం తమకు తోచిన విరాళాలు అందించారు. దీంతో ఏప్రిల్ 12వ తేదీ నాటికి 34 కోట్ల 40 లక్షల రూపాయలు రావటంతో.. నిధుల సేకరణ నిలిపివేశారు. ఇప్పటికే సౌదీలోని కోర్టు కోటి రూపాయలు డిపాజిట్ చేశామని.. మిగతా సొమ్మును 15వ తేదీలోపు డిపాజిట్ చేయటం ద్వారా.. అబ్దుల్ రహీం అతి త్వరలో ఇండియా వస్తారని చెబుతున్నారు కమిటీ సభ్యులు.

దీనిపై ఇప్పుడు కేరళ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ది రియల్ కేరళ స్టోరీ అంటే ఇదీ అని.. ఓ ముస్లిం వ్యక్తిని కాపాడటానికి అన్ని మతాలకు చెందిన వారు ముందుకు వచ్చారని.. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఇదీ అంటున్నారు కేరళీయులు. 

2006లో సౌదీ వెళ్లిన అబ్దుల్ రహీం.. షేక్ కుమారుడిని చూసుకుంటున్న సమయంలో.. ఆ అబ్బాయి మెడకు ఉన్న పైప్ కు.. రహీం చెయ్యి తగిలి పైప్ ఊడిపోయింది. దీని వల్ల ఆ అబ్బాయి ఊపిరిపీల్చుకోవటం కష్టమై.. అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆ తర్వాత చనిపోయాడు. తన కుమారుడి చావుకు రహీం కారణం అని.. అతని నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని ఆ షేక్ కేసు పెట్టాడు. అప్పటి నుంచి 18 ఏళ్లుగా అబ్దుల్ రహీం జైలులోనే ఉంటున్నాడు. (అతనికి పాక్షిక పక్షవాతం). సౌదీ చట్టాల ప్రకారం బాధిత కుటుంబం ఒప్పుకుంటే.. నష్టపరిహారం చెల్లించటం ద్వారా శిక్ష నుంచి బయటపడొచ్చు. ఈ చట్టం ప్రకారమే ఇప్పుడు అబ్దుల్ రహీం బయటకు వస్తున్నాడు..