కేరళలో కరోనా కలకలం.. వాక్సిన్ వేయించుకోని టీచర్లు

కేరళలో కరోనా కలకలం.. వాక్సిన్ వేయించుకోని టీచర్లు

దేశవ్యాప్తంగా ఉద్యమంగా సాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ కేరళలో మాత్రం బ్రేకులు పడ్తున్నాయి. మరో పక్క కేసులు పెరుగుతున్నా కొందరు వేర్వేరు కారణాలతో వ్యాక్సిన్ వేయించుకోవడం లేదంటూ అధికారులు ప్రకటించారు. వారిలో స్కూల్ టీచర్లు, సిబ్బంది ఉండటం మరింత ఆశ్చర్యకరంగా ఉంది.

పలు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తగ్గుతున్నా అక్కడక్కడా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కేరళలో మాత్రం ప్రతి రోజు దాదాపు నాలుగు వేల మంది కరోనా బారినపడుతున్నారు. ఉత్తర కేరళలోని మల్లపురం, కాసర్గాడ్ జిల్లాలోని పలు స్కూళ్లకు చెందిన టీచర్లు, సిబ్బంది ఇంకా కరోనా వ్యాక్సిన్ వేసుకోలేదని తేలింది. అయితే వారందరూ ఆన్ లైన్ లోనే క్లాసులు చెబుతూ స్కూళ్లకు హాజరుకావడం లేదంటూ అధికారులు తెలుపుతున్నారు. ఇందులో మతపరమైన నమ్మకాలతో కొందరు వేసుకోలేదని, మరికొందరు అనారోగ్య సమస్యలతో వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రాలేదని కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి తెలిపారు.

అయితే విద్యార్థులు కరోనా బారిన పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వ్యాక్సిన్ తీసుకోని టీచర్ల వివరాలు సేకరిస్తున్నామని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూళ్లలోకి అనుమతించబోమన్నారు.  బాధ్యతగా వ్యవహరించి వ్యాక్సిన్ తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలని టీచర్లను కోరారు.