
- విజయన్‌తో పాటు అతని కూతురు వీణకు నోటీసులు
కొచ్చి: కేరళ సీఎం పినరయి విజయన్ కు హైకోర్టులో చుక్కెదురైంది. విజయన్ కుమార్తె వీణకు చెందిన ఐటీ సంస్థ ఎక్సాలాజిక్, కొచ్చికి చెందిన మైనింగ్ సంస్థ కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (సీఎమ్‌ఆర్‌ఎల్) మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల కేసులో మంగళవారం సీఎం విజయన్ తో పాటు ఆయన కుమార్తె వీణకు నోటీసులు పంపాలని కోర్టు ఆదేశించింది. సీఎం, ఆయన కుమార్తెపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మాథ్యూ కుజల్‌నాదన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విజిలెన్స్ కోర్టు తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు వారిరువురికి నోటీసులు పంపాలని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 2కి వాయిదా వేసింది. కొచ్చికి చెందిన సీఎమ్‌ఆర్‌ఎల్ కంపెనీకి, వీణా విజయన్‌కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్ మధ్య ఓ వ్యాపార ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం మేరకు ఎటువంటి సేవలు అందించనప్పటికీ 2017 నుంచి- 2018 మధ్య కాలంలో సీఎంఆర్‌ఎల్.. ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కి రూ.1.72 కోట్ల నెలవారీ చెల్లింపులు జరిపిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విజిలెన్స్ తో పాటు ఏసీబీ ద్వారా విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే మాథ్యూ డిమాండ్ చేశారు. అనంతరం ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐఓ, ఆదాయపు పన్ను శాఖ సహా పలు ఏజెన్సీలు ఈ కేసులో వీణ మినహా చాలా మంది వాంగ్మూలాలను నమోదు చేశాయి.