ఎలిఫెంట్ కేర్ అండ్ క్యూర్ సెంటర్‌‌గా కేరళలోని కొత్తూర్

ఎలిఫెంట్ కేర్ అండ్ క్యూర్ సెంటర్‌‌గా కేరళలోని కొత్తూర్

తిరువనంతపురం: కేరళ రాష్ట్రాన్ని దేవనగరిగా పిలుచుకుంటారు. విస్తారమైన అడవులు, కొండలు, సెలయేళ్లు, పచ్చదనాన్ని హారంగా వేసుకుందా అన్నట్లు ఉంటుంది కేరళ. టూరిజంలో ఆ రాష్ట్రం మంచి పేరు తెచ్చుకుంది. ఏనుగులకు కూడా కేరళ ప్రసిద్ధిగా చెప్పొచ్చు. కేరళలోని కొత్తూర్ ఎలిఫెంట్ రీహాబిలిటేషన్ సెంటర్ ఏనుగులకు పాపులర్‌‌గా చెప్పాలి. ఈ సెంటర్ అరుదైన ఘనతను అందుకోనుంది. వరల్డ్ లార్జెస్ట్ కేర్ అండ్ క్యూర్ ఎలిఫెంట్ సెంటర్‌‌గా కొత్తూర్‌‌ను అభివృద్ధి చేయనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్రాలు కలసి ఈ సెంటర్‌‌లో అత్యాధునిక ఏర్పాట్లను సమకూర్చనున్నాయి.

ఏనుగులను సంరక్షించడంలో భాగంగా కేరళ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం కింద ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొలి దశ పనులు పూర్తవనున్నాయి. ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ కోసం రూ.108 కోట్లను కేరళ ప్రభుత్వం కేటాయించింది. అటవీ భూమిలో 50 ఏనుగులు ఉండేందుకయ్యే ఖర్చుల నిమిత్తం కేంద్రం రూ.176 కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా కొన్ని రిజర్వాయర్లు, డ్యామ్స్‌‌ను కూడా నిర్మించనున్నారు. ఏనుగులకు అడవుల్లోలా సహజ సిద్ధమైన పర్యావరణ వ్యవస్థను సమకూర్చడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని కేరళ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.