కేరళకు తెలంగాణ బాయిల్డ్ రైస్

కేరళకు తెలంగాణ బాయిల్డ్ రైస్
  • 2లక్షల టన్నులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి
  • కేరళ సివిల్ సప్లయ్స్  మంత్రితో ఉత్తమ్ భేటీ

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రం నుంచి బాయిల్డ్ రైస్ కొనేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. విజేత, స్వర్ణ రకాలపై ఆసక్తి వ్యక్తం చేసిందన్నారు. కేరళ సర్కార్​కు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని చెప్పారు. శుక్రవారం ఆ రాష్ట్ర సివిల్ సప్లయ్స్ మినిస్టర్ జీఆర్ అనిల్ తో సెక్రటేరియెట్​లో ఉత్తమ్ భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఆహార ధాన్యాల ఒప్పంద అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడారు.

2లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనేందుకు కేరళ ప్రభుత్వం ఆసక్తి వ్యక్తం చేసిందన్నారు. మిర్చి పంట విషయంలో కూడా పాజిటివ్​గానే ఉందని తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన బియ్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కేరళ అవసరాలు తీర్చేందుకు ఉన్న అవకాశాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని సివిల్ సప్లయ్స్ కమిషనర్ డీఎస్ చౌహాన్​ను ఉత్తమ్ ఆదేశించారు. రెండు రాష్ట్రాల సాగు పద్ధతులు, అవసరాలపై కూడా మంత్రులు చర్చించారు. కేరళలో పండించే సుగంధ ద్రవ్యాలపై ప్రధానంగా మాట్లాడుకున్నారు. ఒప్పందం ఫైనల్ అయితే రెండు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.